రిసోర్స పర్సన్ లేకుండానే చదువుకుంటున్న వసతి గృహం విద్యార్థులు
సాక్షి, ఒంగోలు సిటీ: అసలే దివ్యాంగులు..పైగా ఎముకలు,కీళ్ల సంబంధమైన బాధలతో నరకం చూస్తున్నారు. వీరిలో కొందరికి చేతులు,కాళ్లు ఉన్నట్లుగా కన్పిస్తున్నా అవి వంగే పరిస్థితిలో ఉండవు. ఇలాంటి శారీక బాధలతో బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ వసతి గృహానికి వస్తే అక్కడా వారికి న్యాయం జరగడం లేదు. వీరి కోసం ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగం జరుగుతోంది. ఒంగోలు సంతపేటలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ ఎం.రజిని ఆధ్వర్యంలో పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి విజిలెన్సు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు జరిపారు.
జిల్లా కేంద్రం ఒంగోలు సంతపేటలో దివ్యాంగులకు వసతి గృహం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఎక్కడ లబ్ధిపొందే వారికి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా వారు ఎవ్వరికి చెబుకొనే పరిస్థితి లేదు. విజిలెన్స్ అధికారులు ఇటీవల జిల్లాలోని పర్చూరు, కందుకూరు తదితర కేంద్రాలలోని దివ్యాంగుల, బుద్ధిమాంద్యంతో ఇబ్బందిపడుతున్న వారి వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు వారికి అందుతున్న సౌకర్యాలు దీనావస్థలో ఉన్నట్లుగా గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రం ఒంగోలులో నడుస్తున్న దివ్యాంగుల (ఆర్ధో) వసతి గృహంలోని వసతులను పరిశీలించినప్పుడు దారుణమైన విషయాలు బయటపడ్డాయి.
సరైన వసతి కరువు
దివ్యాంగుల వసతి గృహంలో వసతి సరిగ్గా లేదు. రాత్రి వేళ దోమల బెడద. ఉదయం ఎటూ తప్పని కీటకాల సమస్యలు. ఈ బాధలను వీరు నిత్యం అనుభవించి అలవాటు పడ్డారు. వారిని వసతుల విషయమై ప్రశ్నించినప్పుడు దోమలు ఎడతెరిపి లేకుండా కుడుతున్నా అలాగే భరించి అలవాటైందని అంటున్నారు. వీరు అనుభవిస్తున్న ఎముకలు, కీళ్ల సంబంధమైన బాధల కన్నా కీటకాలు పెడుతున్న ఇబ్బంది అంతగా భరించలేనిది కాదు. పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎక్కడ చూసినా మురుగు, అపరిశుభ్రత. ఎప్పుడో గానీ శుభ్రం చేయరు. దీంతో వసతి గృహంలో అనుభవిస్తున్న వసతి వీరికి ఆశించిన సౌకర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. విజిలెన్స్ అధికారుల ఎదుట దివ్యాంగులు తమ బాధలు తెలుపుకొని వాపోయారు.
వసతి గృహంలో శుభ్రత లేని మరుగుదొడ్లు
మరుగుదొడ్డికి వెళ్లాలంటే
ఇక మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అతి చిన్న వయస్సులోనే మోకీళ్లు వ్యాధులు, నొప్పులతో బాధపడ్తున్న వారు అధికమయ్యారు. అన్నీ బాగున్నా, ఆరోగ్యం సరిగ్గా ఉన్న వారే మరుగుదొడ్డి విషయంలో ఎత్తైన వెస్ట్‌రన్ సీటును వాడుతున్నారు. ఇక వీరు దివ్యాంగులు. పైగా వీరిలో అధిక భాగం కాళ్లు వంగే పరిస్థితిలో లేవు. చేతులు పని చేయవు. అలాంటి వారికి నేల బారు సీటుతో ఉండిన మరుగుదొడ్లే వసతి గృహంలో ఉన్నాయి. అవి కూడా సీటు పగిలిపోయి ఎందుకు పనికిరాని విధంగా ఉన్నా వాటితోనే నెట్టుకొస్తున్నారు. దివ్యాంగులు మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడ్తున్నారు.
హాజరులో మతలబు
దివ్యాంగుల వసతి గృహంలో పిల్లల హాజరులో మతలబు చేస్తున్నారు. మొత్తం 25 పిల్లలను హాజరుపట్టీలో చూపిస్తున్నారు. వీరికి తగినట్లుగా ఆహారం డ్రా చేస్తున్నారు. వాస్తవానికి 13 మందే గృహంలో అందుబాటులో ఉన్నారు. మిగిలిన వారికి ఇస్తున్న బియ్యం,ఇతర వస్తువులు దుర్వినియోగం జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రికార్డులను పరిశీలించారు. వీటి ఆధారంగా సరుకులు పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బియ్యం నిల్వలను పరిశీలిస్తే అక్కడిక్కడే 250 కిలోల బియ్యం అదనంగా ఉన్నాయి. అలాగే సరుకులు ఉన్నాయి. వీటిపై నిశితంగా విజిలెన్స్ అధికారులు పరిశీలన చేస్తున్నారు.
పాడుపడిన మిద్దెకు రూ.50వేలు
వసతి గృహం ప్రైవేటు గృహంలో నడుస్తుంది. మిద్దె బాగా పాడుపడింది. దీనికి నెలకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తున్నారు. నెలకు ఇంత పెద్ద మొత్తం వెచ్చిస్తే మంచి సౌకర్యాలు, వసతులు ఉన్న బిల్డింగే వస్తుందని అభిప్రాయపడ్తున్నారు. ఎందు వల్ల ఇంత పెద్ద మొత్తం వెచ్చించి పాడుపడిన మిద్దెలో వసతి గృహాన్ని నడుపుతున్నారని అనుమానాలను వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ తనిఖీ చేసింది. వసతి గృహంలో తాగేందుకు సరిగా నీరు లేదు.
రిసోర్సు పర్సన్ లేరు
వసతిగృహంలోని విద్యార్థులు తొమ్మిది,పది, ఇంటర్,డిగ్రి చదువుతున్న వారున్నారు. వీరికి ఏవైనా డౌట్లు వస్తే సంబంధిత సమస్యను నివృత్తి చేయడానికి అవసరమైన రిసోర్స్ పర్సన్ ఉండాలి. ఇక్కడ ట్యూటర్ కూడా లేరు. వారికి వివిధ సబ్జెక్టుల్లో వచ్చే అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. వీరు చదువుల్లో వెనుకబడి ఉన్నారు.అలాగే ఆహారం కూడా సరిగ్గా లేదు. కనీసం జంతువులు తినేందుకు కూడా పనికిరాకుండా ఆహారం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
బాత్‌రూంలు సరిగ్గా లేవు. విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. దివ్యాంగుల వసతి గృహం సమస్యలకు నెలవుగా ఉంది. దివ్యాంగుల పట్ల అధికారులు, ప్రభుత్వం ఇంత నిర్దయగా ఉందా అన్న వాస్తవాలు అధికారుల ఆకస్మిక దాడుల్లో వెలుగు చూశాయి. అదనపు ఎస్పీ రజిని సాక్షితో మాట్లాడుతూ దివ్యాంగుల వసతి గృహంలో గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లుగా తెలిపారు. ఇలాగే జిల్లాలో ఎక్కడైనా వసతి గృహాల సమస్యలు ఉంటే విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment