కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరగడంతో గురువారం వామపక్షాలు తలపెట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ మద్దతు ఇచ్చి, నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లా కేంద్రం నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.
నెల్లూరు రూరల్: జిల్లాలో గురువారం వామపక్ష పార్టీలు నిర్వహించిన బంద్‌కు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. విద్యాలయాలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. గురువారం జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షను వాయిదావేశారు. సినిమాహాళ్లు, హోటళ్లు, దుకాణాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు కదలలేదు. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టౌన్‌బస్సులు ఒక్కటీ తిరగలేదు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నగరంలోని ప్రధాన కూడళ్లయిన ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జాతీయ రహదారులపై లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు స్వచ్ఛందగా నిలిపివేసి బంద్‌కు మద్దతు తెలిపారు.
వామపక్షపార్టీల నాయకులు, వైఎస్సార్ సీపీ నేతలు ప్రదర్శనగా బయలు దేరి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బంద్‌కు అనూన్యంగా ప్రజా మద్దతు లభించడం, బంద్ విజయవంతం కావడంతో ఆలస్యంగా టీడీపీ నేతలు బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నగర, రూరల్ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి, సీపీఐఎంఎల్ నాయకులు సాగర్, న్యూడెమోక్రసీ నాయకులు కిశోర్‌బాబు బంద్‌ను పర్యవేక్షించారు.
బంద్‌కు మద్దతుగా నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన, అనంతరం వీఆర్సీ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్ నుంచి గాంధీబొమ్మ వరకు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య నేతృత్వంలో నిరసన ర్యాలీ జరిగింది. పొదలకూరులో నిర్వహించిన బంద్‌లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వామపక్షాలతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment