నిలదీత: వాడీవేడిగా జెడ్పీ సమావేశం | ysrcp leaders raise the points on district problems in zp meeting | Sakshi
Sakshi News home page

నిలదీత: వాడీవేడిగా జెడ్పీ సమావేశం

Published Sun, Jan 21 2018 10:27 AM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

ysrcp leaders raise the points on district problems in zp meeting - Sakshi

ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారం చూపాల్సిన జిల్లా సర్వసభ్య సమావేశం గతి తప్పింది. ప్రధానంగా సాగు, తాగునీరు, మరుగుదొడ్ల కుంభకోణంపై వాడీవేడిగా చర్చ సాగింది. ఈ అంశాలపై పాలకపక్ష, విపక్ష సభ్యుల వాగ్వాదంతో సమావేశం రచ్చ..రచ్చగా మారింది. సాగునీటి సమస్యపై చర్చ జరుగుతున్నప్పుడు సోమశిల ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ నాగూర్‌మీరా ఊగిపోతూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై జోక్యం చేసుకున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎస్‌ఈ తీరు సరికాదంటూనే ఆయనకు మద్దతుగా నిలిచారు. కావలి ఎమ్మెల్యేను ‘నీవు రౌడీవి, చాలెంజ్‌ చేస్తున్నా’ అంటూ ఏక వచనంతో బీద మాట్లాడిన తీరును పలువురు సభ్యులు తప్పుపట్టారు. సభ పక్కదారి పడుతున్న నేపథ్యంలో జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కలుగజేసుకుని సభను గాడినపెట్టారు.


నెల్లూరు(అర్బన్‌): స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శనివారం జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షత వహించిన సర్వసభ్య సమావేశంలో సీఈఓ సీహెచ్‌ సుబ్రహ్మణ్యం అజెండాను ప్రవేశపెట్టారు. తొలుత సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీరు, మరుగుదొడ్లు, వీధి లైట్ల నిర్వహణలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ విఫలమైందన్నారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తూ పోలీసు పికెట్‌ పెట్టి కొన్ని గ్రామాలకు సాగునీరు ఇవ్వకుండా తరువాత గ్రామాలకు సాగునీరు ఇస్తున్నారని ఆరోపించారు. కండలేరు కింద మంత్రులు 20,700 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారని అయితే ఎస్‌ఈ మాత్రం 4,500 ఎకరాలకు సరిపడేవిధంగా చెరువులకు ముందు నీరు నింపుతామంటున్నారని విమర్శించారు.

ఈ విషయంపై సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓజిలి ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికే 100 ఎకరాల్లో వరిపంట ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం సోమశిలకు అదనంగా ఐదు టీఎంసీలు నీరు ఇచ్చి కూడా ఏమి లాభమని నిలదీశారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోతున్న చోట ఇరిగేషన్‌ అధికారులే పరిశీలించి నీటిని విడుదల చేసే విధంగా కలెక్టర్‌ అనుమతివ్వాలని కోరారు. డీవీసత్రం జెడ్పీటీసీ సభ్యురాలు ముప్పాళ్ల విజిత మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఒకటి, రెండు తడులు నీరిస్తే పంటలు పండుతాయని తెలిపారు. అధికారులు మధ్యలో గ్రామాలను పక్కకు నెట్టేసి చివరి గ్రామాలకు నీరిస్తున్నారని ఇందులో ఏఈలు, డీఈల స్వార్థం ఉందని ఆరోపించారు. జేసీ ఇంతియాజ్‌ అహ్మద్‌ జోక్యం చేసుకుంటూ పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు.

మరుగుదొడ్లు కుంభకోణం సిగ్గుచేటు
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. మరుగుదొడ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించారని వారందరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జేసీని ప్రశ్నించారు. పేదలకు అన్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. 60 శాతం కూడా మరుగుదొడ్లు పూర్తి కాలేదని, ఇలాంటప్పుడు ఓడీఎఫ్‌గా జిల్లాను ఎలా ప్రకటించారని నిలదీశారు. జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ తాను కూడా కొన్ని గ్రామాలను పరిశీలించానన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రామిరెడ్డి  సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ మరుగుదొడ్లు కుంభకోణానికి పాల్పడిన వారిపై పార్టీలకతీతంగా చర్యలు చేపట్టాలని కోరారు.  జేసీ ఇంతియాజ్‌ సమాధానమిస్తూ అవినీతికి పాల్పడిన వారిపై చర్యలతో పాటు నిధులు మింగిన వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలు లెట్రిన్‌ కమ్‌ బాత్‌రూం నిర్మాణానికి సరిపోవడం లేదని, ఈ మొత్తాన్ని రూ 25,000 ఇచ్చేవిధంగా జెడ్పీ తరపున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సూచన విషయంలో కూడా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు కాకాణి, కోటంరెడ్డితో వాగ్వాదానికి దిగారు.

ప్రాణాలతో వైద్యశాఖ చెలగాటం
దుత్తలూరు జెడ్పీటీసీ సభ్యుడు చీదెళ్ల మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తేలుకుట్టిన బాలికను పీహెచ్‌సీకి తీసుకెళ్తే అక్కడి డాక్టర్‌ చేయికూడా పట్టుకోకుండానే బయటకు నెట్టేశారని విమర్శించారు. దుత్తలూరు, ఉదయగిరి మండలాలకు సంబంధించి 2016లో ఉపాధి హామీ ప«థకం కింద రూ.90లక్షల మేర పనులు చేపట్టారన్నారు. అధికారుల తప్పిదంతో కంప్యూటర్‌లో వివరాలు ఎగిరిపోయాయన్నారు. ఈ నిధులు రాక నేటికీ పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్వామా పీడీ శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేసి విజయవాడకు పంపించి నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ నీళ్లలో మునిగిపోయిన ఇద్దరు బాలురను వాకాడు, కోట ఆస్పత్రులకు తీసుకెళ్తే రెండు చోట్ల డాక్టర్‌ లేరని అందువల్లనే వారు ప్రాణాలు వదిలారని ఆరోపించారు.  వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి సరుకులు ఇళ్లలో పెట్టడం వల్లనే అవినీతి జరుగుతోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే సరుకుల నిల్వ ఉంచాలని సూచించారు. వింజమూరు జెడ్పీటీసీ సభ్యుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో గత సంవత్సరం తాగునీటిని ట్యాంకర్లతో తోలామని, ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు.

ఇఫ్కోపై కలెక్టర్‌ తీరు సరికాదు
రేగడి చెలిక గ్రామం వద్ద ఏర్పాటు అయిన ఇఫ్కో పరిశ్రమలో అదనంగా ఏర్పాటు చేసే ఎలాంటి పరిశ్రమలకు అనుమతులిచ్చేది లేదంటూ గ్రామ సభ తీర్మానం చేసినా, కోర్టులో కేసు ఉన్నా కలెక్టర్‌ ముత్యాలరాజు దొడ్డిదారిలో అక్కడ కాలుష్య పరిశ్రమలకు అనుమతిచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఇందూరు శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

ముఖం చాటేసిన మంత్రులు
జిల్లా మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమావేశానికి రాకుండా ముఖం చాటేశారు. తొలుత జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డితో పాటు వైస్‌ చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరీష, జేసీ ఎ.ఇంతియాజ్‌ అహ్మద్, సీఈఓ సీహెచ్‌ సుబ్రహ్మణ్యం సభను నడిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement