ప్రజా సమస్యలే అజెండాగా...
ప్రజా సమస్యలే అజెండాగా...
Published Wed, Jun 28 2017 11:05 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
- నేడు వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ
- హాజరుకానున్న రాష్ట్ర ప్రముఖులు
- వేదికకు వైఎస్సార్ ప్రాంగణంగా పేరు
- ఏర్పాట్లు పూర్తి చేసిన నేతలు
కాకినాడ : ప్రజా సమస్యలు, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేశారు. కాకినాడకు సమీపంలోని తూరంగి–నడకుదురు రహదారిలోని కుసుమ సత్య కన్వెన్షన్ హాలు వద్ద ఈ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ జరిగే వేదికకు వైఎస్సార్ ప్రాంగణంగా పేరు పెట్టి అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు జిల్లా ముఖ్యనేతల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. జెండా వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రముఖులు ప్లీనరీకి విచ్చేస్తున్నారు.
30 వేల మందికి ఆహ్వానాలు...
మున్నెన్నడూ జరగని రీతిలో జిల్లా ప్లీనరీని నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం సుమారు 30 వేల మందికి నాయకులు, కార్యకర్తకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు కూడా పంపారు. ఆయా నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ముఖ్య నేతలను సమన్వయం చేసి ప్లీనరీకి ఆహ్వానించారు.
ప్రముఖుల రాక...
జిల్లా ప్లీనరీకి రాష్ట్ర స్థాయిలోని పార్టీ ప్రముఖులను ఆహ్వానించారు. జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ప్లీనరీ ప్రత్యేక ఆహ్వానితులు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.పార్థ సారథి, రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ,బీసీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున, జంగా కృష్ణమూర్తి ప్లీనరీకి విచ్చేస్తున్నారు.
.ప్రజా సమస్యలే అజెండా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీకి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా చర్చించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ప్లీనరీలో అనేక ప్రధాన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో జరిగిన ప్లీనరీల్లో చర్చకు వచ్చిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని జిల్లా ప్లీనరీలో తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి నివేదించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి...
ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను పార్టీనేతలు పూర్తి చేశారు. జిల్లాకు చెందిన అనేక మంది నేతలను సమన్వయం చేసి బాధ్యతలు అప్పగించారు. వేదిక అలంకరణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పార్టీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను నేతలు పర్యవేక్షిస్తున్నారు.
ప్లీనరీకి తరలిరండి...
జిల్లా ప్లీనరీకి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలిరావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గ స్థాయిల్లో జరిగిన ప్లీనరీల్లో చర్చకు వచ్చిన అంశాలపై కూడా చర్చించనున్నారు. జిల్లాస్థాయి అంశాలను కూడా చర్చించి తీర్మానాల రూపంలో రాష్ట్ర పార్టీకి నివేదిస్తాం. రాష్ట్ర స్థాయి ప్లీనరీ అనంతరం పార్టీ ఆదేశాల మేరకు ప్రజలకు అండగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తాం.
- కురసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
Advertisement
Advertisement