రోదిస్తున్న కుటుంబీకులు. (ఇన్‌సెట్‌లో) లింగేశ్ మృతదేహం
బోయినపల్లి(చొప్పదండి): సొంతిల్లులేదు.. స్వగ్రామంలో ఉపాది లభించలేదు.. కుటుంబ పోషణ, ఇతర అవసరాల కోసం అప్పు చేశాడు.. అది తీర్చేందుకు పొట్టచేత పట్టుకుని సూరత్ వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురై మృత్యువాత పడ్డాడు. కనీసం శవాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే స్తోమత లేకపోవడంతో దాతలు తలాకొంత విరాళాలు వేసుకున్నా రు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మృతదేహాన్ని ఉంచేందుకూ స్థలంలేక రోడ్డుపక్కనే వేసిన ఉదంతం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జరిగింది.
బోయినపల్లికి చెందిన బొడ్డు లింగేశ్(49) సుతారీ(మేస్త్రీ) పనితోపాటు వ్యవసాయం చేసేవాడు. భార్య కాంతవ్వ, కరణ్, మధు కుమారులు, దివ్య, వైశాలి కూతుళ్లు. లింగేశ్ గతేడాది తనకున్న ఎకరంతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడుల కోసం రూ. రెండు లక్షల వరకు అప్పు చేశారు. దిగుబడి రాక అప్పు మీదపడింది. దీంతో సూరత్ వెళ్లి.. సుతారీ పనిలో కుదిరాడు. అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించి ఈనెల 8న అక్కడి ఆస్పత్రిలో మృతి చెందాడు.
మృతదేహాన్ని తెప్పించడానికి చందాలు..
లింగేశ్ మృతదేహాన్ని స్వగ్రామం తెప్పించేందుకు కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడ్డారు. కొందరు గ్రామస్తులు చందాలు ఇవ్వగా, మరికొందరు అప్పుగా ఇచ్చిన సుమారు రూ.20 వేలను అక్కడి కార్మికులకు పంపించారు. ఈ సొమ్ముతో మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు.
చదువు మానేసి.. పనులకు..
అప్పుల బాధతో లింగేశ్ సూరత్ వెళ్లగా, ఆయన భార్య కాంతవ్వ మానసిక స్థితి కోల్పోయింది. కుటుంబ భారం పెద్ద కుమారుడు, కుమార్తెపై పడింది. దీంతో చదువు మానేసి వారు కూలీలుగా మారారు. కుమారుడు కరణ్, కూతురు దివ్య గంగాధరలో ఒకేషనల్ ఇంటర్ చదివేవారు. కరణ్ కూలి పనికి, దివ్య వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. లింగేశ్ మరణంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది.
రోడ్డుపైనే శవం..
లింగేశ్‌కు సొంతిల్లు లేదు. సోదరుల ఇంట్లో ఓ చిన్న గదిలో కుటుంబసభ్యులు తలదాచుకుంటున్నారు. అక్కడ శవం వేస్తే నిలువ నీడ ఉండదు. పైగా ఆయన మృతి చెంది మూడు రోజులు గడిచింది. దీంతో బోయినపల్లి నుంచి కొదురుపాక వెళ్లే డబుల్ లేన్ రోడ్డు మధ్య పెట్రోల్ బంక్ పరిసరాల్లో మృతదేహాన్ని ఉంచారు. అనంతరం చందాలు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment