ఇంటి పోరు ఇంతింత కాదయా!
ఇల్లు కొంటే మొగుడు మొనగాడు అవుతాడని భార్య అనుకుంటుంది. ఉద్యోగిగా ఉన్న తాను బానిస అవుతానని భర్త అనుకుంటాడు. ఎందుకంటే ఇల్లు కొనడం ఒకప్పుడు జీవితంలో భాగం. ఇపుడు ఒక జీవిత లక్ష్యం. ఇక ఇంటికి పిల్లర్లు వేసేది బిల్డరు కాదు, ఇంటావిడ!
‘ఇప్పటి ఇల్లు’ ఒక మనిషి జీవితకాలపు శ్రమ. తాత్కాలిక ఆవాసం! చిత్రంగా ఉందా? కానీ, అదే నిజం. ఒకప్పుడు తాతలు ఇల్లు కట్టిస్తే మునిమనవడు కూడా అందులో ఏ ఇబ్బందీ లేకుండా నివాసం ఉండేవాడు. ఇపుడు ఒక తరంలో ఇల్లు రెండో తరంలో నివాసానికే కష్టమైపోతోంది. అద్దెకు మించిన మెయింటెనెన్స్ అవసరం అవుతోంది. సొంతింటి ఆనందం కంటే నిర్వహణ బాధే ఎక్కువ.
ప్రతి భర్తకూ ఇల్లు కొనమని ఇద్దరు చెబుతారు... ఆ ఇద్దరు ఒకరు భార్య, ఇంకొకరు బ్యాంకు. ఇంట్లో ‘ఇంటి’ పోరు భలే చిత్రంగా మొదలవుతుంది. భార్యకు ఇల్లు సౌకర్యం అయితే, భర్తకు అది లగ్జరీ. ఎక్కడైనా ఇద్దరిదీ ఒకటే స్థాయి గాని ఇక్కడ మాత్రం కాదు. ఒక్కసారి శ్రీమతి గారికి సొంతిల్లు పైన మోజు కలిగితే ఇక అది రాచపుండులా ఎన్నాళ్లకీ మానదు. ఇక ఆమె దశదశలుగా ఇంటిని కొనడానికి భర్తను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో నాలుగు దశలుంటాయి.
మొదటి దశలో...
మనకు తెలిసిన వారిలో, చుట్టాల్లో ఎవరెవరు ఇల్లు కొన్నారో భార్యామణి ద్వారా మన చెవులకు వద్దన్నా తాకుతుంటుంది.
రెండో దశలో...
ఇల్లు కొన్న వాళ్లు ఎంతెంత సుఖంగా ఉన్నారో, ఇల్లు కొనడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తప్పిపోయాయో ఆమె ఒక డైలీ సీరియల్ అంత అందంగా చెబుతూ ఉంటుంది.
మూడో దశలో...
సొంతిల్లు లేకపోవడం వల్ల ఓనరు పెట్టే ఆంక్షలు, ఇల్లు మారినపుడు వెతకడానికి పోతే నచ్చింది వెంటనే దొరకక, బడ్జెట్లో దొరక్క ఇల్లు మారినపుడల్లా కాస్త లిమిట్ పెంచుకుని ఇంటికోసం ఎక్కువ అద్దెను బాధగా కడుతున్నపుడు ‘చూశావా మనమే ఓ ఫ్లాటు కొనుక్కుని ఉంటే ఎంత బాగుండేది ఊరికే ఇంతింత అద్దె కడుతున్నాం’.. అని ప్రతి నెలా చురకలు, వేధింపులు, మాటల తూటాలు తగులుతూ ఉంటాయి. అపుడు సెగ మొదలవుతుంది. ఆ సెగకు తోడు ప్రతి ఒక్కడు ‘మీరుంటున్న ఇంటిపై మీ పేరు మీద కరెంటు బిల్లు, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు ఉందా?’ అని అడిగినపుడు... ఒరే అవన్నీ ఎలా ఉంటాయిరా అని గట్టిగా అరవాలనిపించిన ఫ్రస్ట్రేషన్‌లో కూడా భార్య సలహా గుర్తొస్తుంటుంది. ఎందుకంటే సొంతిల్లుంటే ఈ బాధలుండవు కదా అని అనిపిస్తుంది. కానీ, వెంటనే బ్యాంకు వాడు, వాడు కట్టే వడ్డీ లెక్కలు తలచుకుంటే మొత్తం మటాష్!
ఇక నాలుగో దశ...
పూర్వీకులు ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పారు... బాగానే ఉంది, భార్య ‘ఇల్లు భర్త లక్షణం’ అంటుంది. ఉద్యోగం అయితే టాలెంటుతో వచ్చేది కాబట్టి కిందా మీద పడి ఏదో సాధించుకోవచ్చు. మరి ఇంటి పరిస్థితి ఏంటి... ఐటీ ఉద్యోగిని పక్కనపెడితే సగటు జీవికి ఇల్లు ఒక అందని ద్రాక్ష. ఎన్నో స్ఫూర్తి కథలు విన్నాక ఇల్లు కొనాలని ఇన్‌స్పైర్ అయ్యి బ్యాంకుకు వెళితే ఒక విషయం అర్థమవుతుంది. బ్యాంకు వాడు తాకట్టు పెట్టుకునేది ఆ కొన్న ఇంటిని కాదు, మన జీవితాన్ని అని. మనిషన్నాక కష్టాలుండవా? జీవితమన్నాక ఒడుదొడుకులుండవా ? అంటే ఒప్పుకోడు నీవేమైనా చేసుకో ఇల్లు కావాలంటే ఇరవై ఏళ్లు లక్షకు వెయ్యి కట్టమంటాడు. ఊరికి దూ...ర...ం....గా... పోయి ఇంతకాలం దాచుకున్నది ఏమైనా ఉంటే దాన్నంతా పెట్టేసి, మరో పదిహేను లక్షల కోసం బ్యాంకు వాడికి ఇంటి రూపంలో మన జీవితాన్ని తాకట్టు పెడితే 20 ఏళ్ల పాటు నెలనెలా ఠంచనుగా తీసుకుంటూనే ఉంటాడు. ఎంత చమత్కారమంటే... ముందు వడ్డీ అంతా లెక్కకట్టి దాన్ని వసూలు చేసి ఆ తర్వాత అసలు తీసుకుంటాడు. ఇక భార్య, బ్యాంకు హ్యాపీ... ఇల్లు కొననంత వరకు ఇల్లే లగ్జరీ, ఇల్లు కొన్నాక సినిమా కూడా లగ్జరీ అయిపోతుంది.
ఉద్యోగం అయితే టాలెంటుతో వచ్చేది కాబట్టి కిందా మీద పడి ఏదో సాధించుకోవచ్చు. మరి ఇంటి పరిస్థితి ఏంటి... ఐటీ ఉద్యోగిని పక్కనపెడితే సగటు జీవికి ఇల్లు ఒక అందని ద్రాక్ష.