బలాబలాలపై పార్టీల్లో చర్చ మొదలైంది. ఓటు బ్యాంకుపై ఆయా పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లను కాపాడుకుంటే విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఓటు బ్యాంకు దెబ్బతినకుండా అన్నిపార్టీల నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. సంక్షేమ పథకాలే అస్త్రంగా అధికార పార్టీ దూసుకుపోతుండగా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడంతో ప్రచారంRANGAలో దూసుకెళ్తున్నారు. ఇక మహాకూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐల సీట్ల సర్దుబాటు కూడా ఇక కొలిక్కి వచ్చినట్లే. బీజేపీ కొన్ని సీట్లను ప్రకటించింది. అయితే, ఇటీవల మరో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పార్టీలకు ఏ మేరకు బలాబలాలు ఉన్నాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చజరుగుతోంది. 2014 నాటి ఎన్నికల్లో ఆయా పార్టీలకు దక్కిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులు లెక్కలు వేస్తూ గెలుపు ఓటములపై అంచనాలు మొదలుపెట్టారు.
గత ఎన్నికల్లో టీడీపీ,బీజేపీకే మొగ్గు:
ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీల బలాబలాల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు దక్కిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. గత ఎన్నికల సమయంలో 53.49 లక్షల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం 29.89 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 28.90 శాతం, కాంగ్రెస్‌కు 22.60 శాతం, టీడీపీ–బీజేపీకి అత్యధికంగా 30.83 శాతం ఓట్లు దక్కాయి. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు.
వీరిని కొంతమేర పార్టీశ్రేణులు, అనుయాయులు అనుసరించారు. ఈనేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు కాస్త మారాయి. ఇదిలా ఉండగా, కొంకాలం క్రితం ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరిగాయి. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ పాలనపై ఆగ్రహంతో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ తదితర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్లినవారు.. తిరిగి సొంతగూటికి చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ఆయా నియోజకవర్గాల్లో మార్పులుచేర్పులు జరుగుతున్నాయి.
ఓటు బ్యాంకుపై నజర్ :
అప్పటి ఓటు బ్యాంకును కాపాడుకుంటే గెలుపు తథ్యమనే మహాకూటమి అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగెస్, టీడీపీకి దక్కిన ఓట్ల శాతం 53.43. ముఖ్యంగా వలసలు అధికంగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడ్డాయి. ఇక మేడ్చల్, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ భారీగానే ఓట్లు సంపాదించింది. చేవెళ్ల, పరిగిలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీనిని పక్కనబెడితే.. 14 అసెంబ్లీ సెగ్గెంట్లలో వికారాబాద్, తాండూరు మినహా కాంగ్రెస్, టీడీపీకి దక్కిన ఓట్లు.. టీఆర్‌ఎస్‌కు లభించిన ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఓటు బ్యాంకును కాపాడుకుంటే తమకు తిరుగు ఉండదన్న ధీమాను మహాకూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ విషయానికి వస్తే.. చేరికలతో ఆ పార్టీ క్రమంగా బలపడుతోంది.
దీనికితోడు నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ ఈసారి ఒంటిరిగానే బరిలోకి దిగుతోంది. గత ఎన్నికల్లో ఉప్పల్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. ఈసారి జిల్లాలో సాధ్యమైనంత మేర సీట్ల సంఖ్య పెంచుకునే లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పార్టీకి చెందిన జాతీయ నేతలను రంగంలోకి దింపింది ఇప్పటికే. మొత్తం మీద నాలుగున్నరేళ్లలో మారిన రాజకీయ పరిణామాలతో ఓటర్లు ఎవరివైపు ఉన్నారు.. విజయం ఎవరికి వరించనుందో అనే అంశాలపై నేతలు చర్చించకుంటున్నారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మహాకూటమి శక్తిమేర ప్రయత్నిస్తుండగా.. ఆ ఓట్లను చీల్చేందుకు టీఆర్‌ఎస్ కూడా గట్టిగానే పోరాటం చేస్తోంది.
2014లో మొత్తం ఓటర్లు: 53,49,742
పోలైన ఓట్లు: 29,89,027
కాంగ్రెస్‌కు దక్కిన ఓట్లు : 22.60 %
టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లు : 28.90 %
టీడీపీ–బీజేపీకి లభించిన ఓట్లు: 30.83 %
2014 ఎన్నికల్లో పార్టీల వారీగా దక్కిన ఓట్ల శాతం :
కాంగ్రెస్ టీఆర్‌ఎస్ టీడీపీ
మేడ్చల్ 58,016 (22.05) 114235 (43.41) 70,780 (26.90)
మల్కాజిగిరి 37,201 (16.12) 77,132 (33.42) 74,364 (32.22) (బీజేపీ)
కుత్బుల్లాపూర్ 40,283 (13.87) 75,339 (25.94) 114,363 (39.38)
కూకట్‌పల్లి 23,321 (10.04) 56,688 (24.41) 99,874 (43.00)
ఉప్పల్ 34,331 (15.20) 68,226 (30.20) 82,395 (36.47) (బీజేపీ)
ఇబ్రహీంపట్నం 36,865 (20.32) 21,779(12.00) 48,397 (26.67)
ఎల్బీనగర్ 56,489 (22.52) 71,791 (28.62) 84,316 (33.61)
మహేశ్వరం 62,521 (28.72) 42,517 (19.53) 93,305 (42.86)
రాజేంద్రనగర్ 51,962 (22.63) 29,870 (13.01) 77,843 (33.91)
శేరిలింగంపల్లి 43,384 (15.33) 53,539 (18.92) 129,796 (45.87)
చేవెళ్ల 63,401 (39.48) 64,182 (39.00) 15,117 (9.30)
పరిగి 68,098 (45.34) 62,935 (41.91) 13,355 (8.89) (బీజేపీ)
వికారాబాద్ 54,520 (39.54) 64,592 (46.84) 6,335 (4.59) (బీజేపీ)
తాండూరు 45,219 (33.92) 61,293 (45.97) 11,362 (8.52)
మొత్తం 6,75,611 (22.60) 8,64,118 (28.90) 9,21,602 (30.83)
Comments
Please login to add a commentAdd a comment