మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు
తుర్కయంజాల్: కాంగ్రెస్, టీడీపీలు ఏర్పాటు చేసింది దొంగల కూటమి అని.. దానిని ప్రజలు విశ్వసించబోరని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ ధూంధాం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికి భారీవర్షం కురవడంతో అనంతరం ఆయన స్థానిక తిరుమల కన్వెన్షన్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన 4 ఏళ్లలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేశారని చెప్పారు.
బడుగుబలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు అనాడు అధికారంలో ఉన్న విషయాన్ని గమనించాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు సాధ్యం కాని హమీలతో ప్రజలను మోసం చేయాలని యత్నిస్తున్నారని, దీనిని జనం గమనించాలని సూచించారు. తాము సుమారు 39 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 65 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు.
సంక్షేమ పథకాలే తిరిగి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రి తలసాని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సుమారు రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారని అన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త వంగేటి లక్ష్మారెడ్డి, హయత్‌నగర్ మండలం ఎంపీపీ బబ్బూరు మంజుల, జెడ్పీటీసీ తావుల నర్సింహ్మ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment