ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి జిల్లా కంచుకోట. 2014 ఎన్నికల వరకు జిల్లా ప్రజానీకం ఆ పార్టీని ఆదరించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదిలాబాద్, అనంతపురంతో పాటు రంగారెడ్డి జిల్లా కూడా టీడీపీకి దన్నుగా ఉంటుందనే చర్చ కూడా ఉండేది. కానీ, నాలుగేళ్ల తర్వాత సీన్ చూస్తే.. రివర్స్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఏడు సీట్లు, మిత్రపక్షమైన బీజేపీతో కలిసి 8 సీట్లలో విజయఢంకా మోగించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాకూ కొన్ని స్థానాలు ఇవ్వండి మహాప్రభో.. అంటూ ఇతర పార్టీలను ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2014 ఎన్నికల ప్రాతిపదికన జిల్లాలో గెలిచిన 7 సీట్లూ తమకు కావాల్సిందేనని మొదట్లో పట్టుపట్టిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కనీసం మూడు, నాలుగైనా ఇవ్వాలని కాంగ్రెస్, ఇతర పక్షాలను వేడుకుంటున్నారు. అయితే, అవి కూడా కుదరదని, కూకట్‌పల్లి, ఉప్పల్‌తో సరిపెట్టుకోవాలనే చర్చ కూటమిలో జరుగుతుండడం పచ్చ పార్టీకి మింగుడు పడడం లేదు. ఈనేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో తెలుగుదేశం పార్టీ గతంలో క్షేత్రస్థాయిలో బలంగా ఉండేది. సమర్థ నాయకత్వం..అంకితభావం గల కార్యకర్తలతో పార్టీ జిల్లా రాజకీయాలను శాసించింది. ఆఖరికి రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ రాష్ట్రం మొత్తం టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయినా.. రంగారెడ్డి జిల్లాలో మాత్రం అత్యధిక సీట్లను గెలుచుకొని అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో గెలిచిన ఏడుగురు శాసనసభ్యుల్లో ఆరుగురు గులాబీ గూటికి చేరగా..ఎల్‌బీనగర్ శాసనసభ్యుడు కృష్ణయ్య మాత్రం తటస్థ వైఖరిని అవలంభించారు. శాసన మండలి, గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో నాయకులంతా కారెక్కగా.. కేడర్ కూడా దాదాపుగా వారినే అనుసరించింది.
అయితే, శివారు సెగ్మెంట్లలో టీడీపీకి ఇప్పటికీ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండడం.. తాజా పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కలిసివస్తుందని కాంగ్రెస్ భావించింది. ఈ క్రమంలోనే మహాకూటమికి అంకురార్పణ జరిగింది. ఈ పరిణామాలు తెలుగు తమ్ముళ్లకు ఊపిరూదాయి. అయితే, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన సిట్టింగ్ స్థానాలన్నింటినీ తమకే కేటాయించాలని మొదట పట్టుబట్టినా.. చివరకు ఉప్పల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ స్థానాలు కావాలని ప్రతిపాదించింది. దీనికి కాంగ్రెస్ ససేమిరా అనడమేగాకుండా కేవలం ఉప్పల్, కూకట్‌పల్లితో సర్దుకుపోవాలని సూచించింది.
మల్కాజిగిరిని టీజేఎస్‌కు కేటాయిస్తున్నందున.. ఆ స్థానంపై పేచీ పెట్టవద్దని స్పష్టం చేసింది. ఈ రెండు సీట్లపై అయిష్టంగానే తలూపిన టీడీపీ మరో రెండు సెగ్మెంట్లు కావాలని కోరుతోంది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్‌లో రెండు సీట్లను కేటాయించాలని పట్టుబడుతోంది. కాదు కూడదంటే శేరిలింగంపల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించే అంశం కాంగ్రెస్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, టీడీపీ ఆశావహులు మాత్రం సీట్ల పంపకం కొలిక్కి రాకమునుపే ప్రచారపర్వంలో నిమగ్నమయ్యారు. ఉప్పల్‌లో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ ఇప్పటికే ఎన్నికల ప్రచార భేరీని మోగించగా.. ఎల్‌బీనగర్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. అధిష్టానం ఒకవైపు కాంగ్రెస్, ఇతర పక్షాలతో చర్చోపచర్చలు సాగిస్తుండగా.. నియోజకవర్గాల్లో మాత్రం ఆశావహులు మాత్రం పట్టువదలకుండా ప్రచారపర్వంలో తలమునకలు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment