సైనిక్‌పురి కార్యాలయంలో కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన బండారు లక్ష్మారెడ్డి
సాక్షి, రంగారెడ్డి ప్రతినిధి: పొత్తుల వ్యవహారం కాంగ్రెస్ నేతల్లో కలవరం సృష్టిస్తోంది. టీడీపీతో సయోధ్య కుదిరితే ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన పలువురినివెంటాడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)ని ఢీకొనాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని నిర్ణయిం చాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తుకు బీజం పడింది. శివారు సెగ్మెంట్లలో టీడీపీకిచెప్పుకోదగ్గ బలం ఉందని, ఉమ్మడిగా బరిలో దిగడం వల్ల లాభం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సమీకరణాలన్నింటినీ విశ్లేషించిన కాంగ్రెస్.. శివార్లలో కొన్ని నియోజకవర్గాలను టీడీపీకి వదిలేసే అంశంపై చర్చిస్తోంది.
రాష్ట్ర స్థాయిలో పొత్తు అంశం తేలనప్పటికీ.. జిల్లాలో మాత్రం పొత్తు పొడిస్తే ఎవరి టికెట్టు గల్లంతవుతుందోననే ఆం దోళన వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీతో చేయి కలిపితే పార్టీని వీడేందుకు కూడా కొందరు కాంగ్రెస్ ఆశావహులు రెడీ అవుతున్నారు. పొత్తుతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి బండారి లక్ష్మారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉప్పల్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. ఆయనే కాకుండా మరికొందరు కూడా పార్టీ వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
పొత్తు పొడవకముందే...
గత ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. అనంతరం మారిన రాజకీయ సమీకరణలతో ఎల్‌బీనగర్ మినహా మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ గులాబీ గూటికి చేరారు. దీంతో ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో ఆ పార్టీ ఇప్పుడు నామ్‌కే వాస్తేగా మిగిలింది. 2014లో బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం.. ఏపీ హక్కుల విషయంలో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజకీయ శత్రువు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతామని సంకేతాలిచ్చింది.
దీనికి అనుగుణంగా ఇరుపార్టీల అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం బాధ్యత టీడీపీ మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఉప్పల్ సీటు ఆశించి భంగపడ్డ ఆయన కుమారుడు వీరేందర్‌కు పొత్తులో భాగంగా ఈసారి అవకాశం లభిస్తుందని భావించిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డికి పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలావుండగా, గత ఎన్నికల్లో గెలుపొందిన సెగ్మెంట్లను తమకే వదిలేయాలని టీడీపీ పట్టుబడుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ ఆశావహుల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
మహేశ్వరంపైనా కన్ను!
మహేశ్వరం నియోజకవర్గంపై కూడా టీడీపీ కన్నేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీ తరఫున గెలుపొందిన నేపథ్యంలో ఈ సీటును కూడా కోరుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ పోటీచేయాలని భావిస్తున్నారు. సొంత నియోజకవర్గం కావడం.. పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ ఉండడంతో మహేశ్వరం నుంచి బరిలో దిగాలని యోచిస్తున్నారు. 2009లో ఈ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈసారి ఇక్కడి నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా మొదలు పెట్టారు.
గత ఎన్నికల్లో కొడుకు కార్తీక్‌రెడ్డి కోసం సీటును త్యాగం చేసిన ఆమె.. ఈ సారి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా పరిణామాలను ఆమె వర్గీయుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాలను తమకే కేటాయించాలని టీడీపీ పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ఎవరి సీటుకు ముప్పు తెస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పొత్తు చర్చలు కొలిక్కి వస్తే తప్ప ముందడుగు వేయకూడదని ఆశావహులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment