కాంగ్రెస్ పార్టీలో జిల్లానుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న కసరత్తు ఆ పార్టీ నాయకుల అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 నియోజకవర్గాల నుంచి పోటాపోటీగా అధిష్టానానికి దరఖాస్తు చేస్తున్నారు. రెండుచోట్ల మాత్రమే ఒక్కొక్క పేరు ఉండగా.. మిగతా స్థానాల్లో ఆశావహులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై తమ ప్రతిపాదనలను పంపాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవలే ఏఐసీసీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస కృష్ణన్ రెండు పర్యాయాలు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పొత్తు నేపథ్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఇటీవలే చర్చలు జరిపారు. గెలిచే స్థానాలు మినహా మిగతా చోట్ల ఇతర పార్టీలకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ముగ్గురు సభ్యులతో అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా భక్తచరణ్‌దాస్, సభ్యులుగా శర్మిష్ఠముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమైలతో స్క్రీనింగ్ కమిటీ వేయడం.. ఆ కమిటీ 25న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం కానుండడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. ఈనెల 25న హైదరాబాద్‌కు రానున్న స్క్రీనింగ్ కమిటీ పార్టీనేతలతో సమావేశం కానుంది.
ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల నుంచి అందిన ఆశావహుల దరఖాస్తులు, ముఖ్యనేతలు, డీసీసీ కమిటీలు సిఫారసు చేసిన పేర్లపై చర్చించి.. పోటీ ఉన్న సెగ్మెంట్లలో ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున పేర్లను అధినేత రాహుల్‌గాంధీకి సిఫారసు చేయనున్నారని చెప్తున్నారు. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే, తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి (జగిత్యాల), మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు (మంథని) స్థానాలకు ఒక్కొక్క పేరే ఉండగా, మిగతా చోట్ల మూడు నుంచి ఎనిమిది మంది వరకు టికెట్ ఆశిస్తున్నారు. ముందస్తుగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారాన్ని నిర్వహించగా.. కాంగ్రెస్ పొత్తులు, టికెట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
పొత్తులలో నాలుగు స్థానాల్లో కిరికిరి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్ నేతలతో చర్చలు జరిపింది. టీడీపీ పొత్తుల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలు, సీపీఐ, టీజేఎస్ పార్టీలు తలో సీటును కోరుతున్నట్లు చెప్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కోసం హుజూరాబాద్, కోరుట్ల స్థానాల నుంచి టికెట్ అడుగుతున్నట్లు సమాచారం. హుస్నాబాద్ స్థానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఇవ్వడం అనివార్యమంటున్నారు. ఇదే సమయంలో టీజేఎస్‌కు ఇచ్చే స్థానాల్లో హుజూరాబాద్‌ను కూడా అడుగుతున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ ఈ జిల్లా నుంచి టీడీపీ ఒకటే స్థానాన్ని కోరితే... హుజూరాబాద్‌ను టీజేఎస్ జిల్లా కన్వీనర్ ముక్కెర రాజుకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పొత్తులో భాగంగా టీడీపీకి రెండు స్థానాలు ఇస్తే హుజూరాబాద్, కోరుట్లలో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు నిరాశే మిగలనుంది. హుస్నాబాద్ పరిస్థితి కూడా అంతే కానుండగా.. పొత్తులలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వదులుకుంటుందన్న చర్చ ఇప్పుడా పార్టీ నేతల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.
కాంగ్రెస్‌లో ఎక్కడి నుంచి ఎవరు..?
పొత్తులు, సీట్ల కేటాయింపు ఇంకా స్పష్టత రాకపోగా.. జగిత్యాల, మంథని మినహా 11 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 8 మంది నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలు పరిశీలిస్తే..
- కరీంనగర్: చల్మెడ లక్ష్మినర్సింహారావు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, రేగులపాటి రమ్యారావు, కటకం మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరామ్, ఉప్పుల అంజనీ ప్రసాద్, గందె మాధవి, జువ్వాడి నిఖిల్‌చక్రవర్తి, కొత్త జైపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
- సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేకే.మహేందర్ రెడ్డి, డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, దరువు ఎల్లయ్య తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కేకే.మహేం దర్ రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు.
- వేములవాడ: గతంలో పోటీచేసి ఓడిపోయిన బొమ్మ వెంకటేశ్వర్, ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డి, కొలగాని మహేష్ తదితరులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
- చొప్పదండి: ఓయూ జేఏసీ నేత మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం, బండ శంకర్, నాగి శేఖర్‌తోపాటు పలువురు ఆశిస్తున్నారు. సామాజిక కోణంలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న విషయంలో పార్టీ పరిశీలిస్తోంది.
- హుజూరాబాద్: జమ్మికుంట ఏఎంసీ చైర్మన్ తు మ్మేటి సమ్మిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, స్వరం రవి, పరిపాటి రవీందర్ రెడ్డి తదితరులు టికెట్ రేసులో ఉన్నారు.
- పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణరావు, ఈర్ల కొంరయ్య, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి తదితరులు టికెట్ రేసులో ఉన్నారు.
- రామగుండం: రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బడికెల రాజలింగం, ఐఎన్‌టీయూసీ నేత జనక్‌ప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, హర్కర వేణుగోపాల్ తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
- కోరుట్ల: కొమొరెడ్డి రామ్‌లు, జేఎన్.వెంకట్, బీజేపీకి రాజీనామా చేసిన రఘు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఓ ప్రధాన పార్టీలో కొనసాగుతున్న ముఖ్యనేత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ ఆశించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- హుస్నాబాద్: హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరే ప్రధానంగా ఉండగా.. బొమ్మ వెంకటేశ్వర్, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.
- ధర్మపురి: ఈ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు మద్దెల రవీందర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు.
- మానకొండూరు: మాజీ విప్ ఆరెపల్లి మోహన్‌కు ఇక్కడి నుంచి టికెట్ పక్కా అయ్యిందన్న ప్రచారం ఉంది. అయితే రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ కూడా ఇక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment