పొత్తులు.. ఎత్తులు | Congress Alliance With TDP CPI In Telangana | Sakshi
Sakshi News home page

పొత్తులు.. ఎత్తులు

Published Mon, Sep 24 2018 8:04 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Alliance With TDP CPI In Telangana - Sakshi

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నాలుగు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినా... ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీట్ల సర్దుబాట్లపై సస్పెన్స్‌ వీడలేదు. ఆయా పార్టీలు ప్రతిపాదిస్తున్న స్థానాలపై పొత్తులు పొసగడం లేదు. శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒక్క చొప్పదండి మినహా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ‘మహా కూటమి’ పేరిట కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పొత్తు కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైందని చెప్తున్నారు.

అయితే కరీంనగర్‌ జిల్లాలో ఈ విషయమై సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 13 స్థానాలకు పోటీ పడుతుండగా.. టీజేఎస్‌ మూడు, సీపీఐ ఒకటి, టీడీపీ రెండు స్థానాలను అడుగుతున్నట్లు చెప్తున్నారు. కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీలకు ఆరుస్థానాలు పోతే.. ఆ పార్టీకి మిగిలేది ఏడు స్థానాలే. అయితే ఈ తరహా పొత్తులు ఉమ్మడి కరీంనగర్‌లో సాధ్యం కాదని కాంగ్రెస్‌ శ్రేణులు చెప్తున్నాయి. ఎక్కడైతే టీజేఎస్, టీడీపీ, సీపీఐలు సీట్లు అడిగే అవకాశం ఉందో.. ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో కాంగ్రెస్‌తోపాటు మహాకూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఆసక్తి నెలకొంది. 

 సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికల్లో ‘మహా కూటమి’ (ప్రజాకూటమి) పేరిట సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు కాంగ్రెస్, టీ టీడీపీ, సీపీఐ, కోదండరాం నేతత్వంలోని టీజేఎస్‌ ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యేనాటికి ఈ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పోటీ చేసే శాసనసభ స్థానాల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌లో దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి నియోజకవర్గానికో భారీ బహిరంగ సభ, అభ్యర్థుల మూడు విడతలుగా నియోజకవర్గాన్ని చుట్టే వ్యూహం తో ముందుకెళ్తోంది. కారు దూకుడును అడ్డుకోవాలంటే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు ప్రక్రియను కూటమి రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయడం అత్యవసరం.

ఈ నేపథ్యంలో తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు, బలాబలాలు, అభ్యర్థులపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి 13 స్థానాలకు అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. శనివారం నాటికి 61 మంది డీసీసీ, టీ పీసీసీలకు ఇక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కూటమి పార్టీలైన టీజేఎస్‌ మూడు, సీపీఐ ఒకటి, టీటీడీపీ రెండు స్థానాలపై గురి పెట్టినట్లు ఆయా పార్టీల జిల్లా నాయకత్వం ప్రతిపాదనలుగా క్యాడర్‌ ముందుపెడుతోంది. ఒకవేళ ఆయా పార్టీలు చేసిన ప్రతిపాదనలకు ఒకే అంటే కాంగ్రెస్‌ పార్టీకి మిగిలేది ఏడు స్థానాలే. అలాంటప్పుడు అసలే కుదరదని టీజేఎస్, టీ టీడీపీ, సీపీఐకి తలా ఒక్కటి ఇస్తే ఎక్కువేనని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఇలా ఓ వైపు కూటమి పార్టీల్లో రకరకాలుగా చర్చ జరుగుతుండగా.. ఇంకోవైపు ఎవరికివారుగా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.

పోటీపై సందిగ్ధంలో టీ టీడీపీ.. హుస్నాబాద్‌పై సీపీఐ, మూడు సీట్లపై     టీజేఎస్‌ గురి
తొలిసారిగా కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనకు సిద్ధమైన టీ టీడీపీ మొదటి నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కనీసం రెండుస్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ హుజూరాబాద్, జగిత్యాల నుంచి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు. జగిత్యాల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తాజామాజీ టి.జీవన్‌ రెడ్డి ఉండటంతో అక్కడ సాధ్యం కాదని కోరుట్ల అనుకున్నారు. అయితే పెద్దిరెడ్డి గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్తుండగా.. ఎల్‌.రమణ కోరుట్లపై అంతగా ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీలో క్యాడర్‌ అంటోంది.

ఇదే జరిగితే ఈ సారి కూటమి నుంచి టీ టీడీపీ జిల్లాలో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది. అదే విధంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పోటీకీ ఆసక్తిగా ఉన్నారు. ఆయన వారం రోజులుగా విస్తృతంగా అభ్యర్థిగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇటు ప్రవీణ్‌రెడ్డి పోటీ పడుతుండటం.. సీపీఐ ఉమ్మడి జిల్లాలో అడిగే ఒకేఒక సీటు అదికూడా హుస్నాబాద్‌ కావడంతో ‘ఏం చేద్దాం’ అనే సందిగ్ధంలో కూటమి వర్గాలు ఉన్నట్లు తెలిసింది. హుస్నాబాద్‌ సాధ్యం కాకపోతే కామ్రెడ్లకు రామగుండం ఇద్దామనే యోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఐదు సీట్లపై కన్నేసిన టీజేఎస్‌ కనీసం మూడైనా ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. హుజూరాబాద్, రామగుండం, సిరిసిల్ల.. లేదంటే కరీంనగర్, హుజూరాబాద్, రామగుండం ఇవ్వాలని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

10 స్థానాలపై కాంగ్రెస్‌ కసరత్తు.. మూడు స్థానాలపై పీటముడి.. పొత్తుపొడిచాక ప్రకటన
కాంగ్రెస్‌ పార్టీ ఓ వైపు కూటమి భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు చేస్తూనే.. మరోవైపు పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ వేగవంతం చేస్తోంది. 13 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 61 మంది టికెట్ల కోసం డీసీసీ, టీ పీసీసీలకు దరఖాస్తు చేసుకున్నారు. సీనియారిటీ, లాబీయింగ్, ప్రజాబలం తదితర అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల ప్రకటనపై కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. 10 స్థానాలపై కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం.. మరో మూడు స్థానాలపై ఆచీతూచీ వ్యవహరిస్తోంది.

జగిత్యాల, మంథనికి మాజీమంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు ఉండగా.. మానకొండూరుకు మాజీవిప్‌ ఆరెపెల్లి మోహన్‌ పేర్లు తొలి విడత జాబితాలో ఉన్నట్లు చెప్తున్నారు. కరీంనగర్, హుస్నాబాద్, పెద్దపల్లి, హుజూరాబాద్, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ స్థానాల్లో ఇద్దరు నుంచి 10 మంది వరకు టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఈ స్థానాలలో సైతం అభ్యర్థులపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కోరుట్ల, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల విషయంలో అధిష్టానం ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు నుంచి నలుగురి పేర్లు పరిశీలిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే కీలక నేతల పేర్లు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ‘కూటమి’ పార్టీలతో పొత్తులు పొసిగాక ఒకటి, అర మార్పులతో జాబితాను త్వరలోనే ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement