బీజింగ్ : పిల్లలతో హోం వర్క్ చేయించడం తల్లిదండ్రులకు ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క చోట కుదురుగా కూర్చుని.. బుద్ధిగా హోం వర్క్ పూర్తి చేస్తే.. ఆ రోజుకు గండం గడిచినట్లే. కానీ మన చిచ్చరపిడుగులు అలా చేయరు కదా. హోం వర్క్ చేస్తూ.. వేరే పనిలో పడటం.. ఫోన్ చూస్తూ గడపటం వంటివి చేస్తారు. ఇక వారి గోల తట్టుకోలేక ట్యూషన్లకి పంపిస్తుంటారు. కానీ చైనాకు చెందిన ఓ తండ్రి మాత్రం కూతురుతో హోం వర్క్ చేయించే బాధ్యతను ఓ నయా ట్యూటర్‌కి అప్పగించాడు. ఆ ట్యూటర్‌ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఆ ట్యూటర్ ఓ కుక్క కాబట్టి. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.
వివరాలు.. జూ లియాంగ్ అనే వ్యక్తి తన కూతురి చేత హోం వర్క్ చేపించే బాధ్యతను పెంపుడు కుక్కకు అప్పగించాడు. ఇందుకోసం దానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. దాంతో జూ కుమార్తె హోం వర్క్ చేసుకునేటప్పుడు.. ఆ కుక్క ఆమెకు ఎదురుగా నిల్చుని పర్యవేక్షిస్తుంటుంది. ఒక వేళ ఆ అమ్మాయి గనక హోం వర్క్ పూర్తి చేయకుండా మధ్యలో ఫోన్‌తో ఆడటంలాంటివి చేస్తే.. మాత్రం ఊరుకోదు. తన యజమానురాలు హోం వర్క్ పూర్తి చేసిందని భావిస్తేనే.. ఫోన్‌ని టచ్ చేయడానికి అనుమతిస్తుంది.
ఈ విషయం గురించి జూ లియాంగ్ మాట్లాడుతూ.. ‘తొలుత ఈ కుక్కకు పిల్లి నుంచి ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనే అంశంపై ట్రైనింగ్ ఇచ్చాను. ఈ క్రమంలో ఓ రోజు నా కుమార్తె హోంవర్క్ పూర్తి చేయకుండా గోల చేయడం చూశాను. దాంతో నా కూతురి చేత హోం వర్క్ చేపించే బాధ్యత నా కుక్కకు ఇవ్వాలనుకున్నాను. అందుకు అనుగుణంగా నా పెంపుడు కుక్కను ట్రైన్ చేశాను. ఇప్పుడది నా కూతురు హోం వర్క్ చేసేటప్పుడు.. తన ఎదురుగా నిల్చుని గమనిస్తుంది. ఒక వేళ నా కూతురు హోం వర్క్ మధ్యలో వదిలేసి ఫోన్‌తో ఆడాలని చూస్తే.. వెంటనే మొరుగుతూ తనను భయపెట్టడానికి ట్రై చేస్తుంద’ని వెల్లడించారు. ఈ విషయం గురించి జూ కూతురు మాట్లాడుతూ.. ‘నా కుక్కతో కలిసి హోం వర్క్ చేయడం చాలా బాగుంది. ఇంతకు ముందు హోం వర్క్ చేయాలంటే చాలా బోర్‌గా ఫీలయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నేను చాలా శ్రద్ధగా హోం వర్క్ పూర్తి చేస్తున్నాను’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment