
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. జననేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయి అఖండ విజయం సాధించారు. అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, లోక్‌సభ సీట్లు క్లీన్‌స్వీప్ చేసేలా ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు నాపై మరింత బాధ్యత ఉంచారు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటా. ఆరు నెలల నుంచి ఏడాదిలోపే మీ చేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. ఈనెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని పేర్కొన్నారు. ఈ క్రమంలో మహానేత తనయుడు జగనన్న పాలనలో మరోసారి రాజన్న రాజ్యం సిద్ధిస్తుందని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘జగన్ అనే నేను’ అంటూ జననేత పలికే మాటలను ఉటంకిస్తూ.. ‘అప్నా టైమ్ ఆగయా అన్నా’ అంటూ ఆకాశమే హద్దుగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పాదయాత్రికుడి ఏకపక్ష విజయాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.