ప్రతీకాత్మక చిత్రం
మహానగరంలో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. పైగా రాత్రి వేళల్లో అది కూడా అర్ధరాత్రి ఏ ఆటోలోనో, క్యాబ్‌లోనో వెళ్లాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయం. అందుకే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోను ఆశ్రయించాడో కుర్రాడు. పైసా ఖర్చు లేకుండా హాయిగా ఇంటికి చేరుకుని ఎంచక్కా దోశెలు తిన్నాడు. ఏంటీ అర్థం కాలేదా? జొమాటోకు క్యాబ్ సర్వీస్‌కు ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా. అయితే మీరు హైదరాబాదీ ఒబేశ్ కొమిరిశెట్టి ఫేస్‌బుక్ పోస్టు చదవాల్సిందే.
5 స్టార్ రేటింగ్ ఇవ్వండి ప్లీజ్..
‘రాత్రి 11 గంటల 50 నిమిషాలకు. నేను ఇనార్బిట్‌మాల్ రోడ్‌లో ఉన్నా. రూంకు వెళ్లేందుకు ఆటో కోసం చూస్తున్నా. ఎంతసేపటికీ ఆటో రాకపోవడంతో ఉబెర్ యాప్ ఓపెన్ చేశా. కానీ చార్జీ రూ. 300 దాకా అవుతుందని చూపించింది. అప్పుడే చిన్నగా ఆకలి మొదలైంది. దీంతో జొమాటో యాప్ ఓపెన్ చేసి నేను ఉన్న చుట్టుపక్కల ఏదైనా ఫుడ్ స్టోర్ ఉందేమో చూశా. అక్కడ దగ్గర్లో ఉన్న ఓ దోశ బండి జొమాటో యాప్‌లో కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఎగ్‌దోశ ఆర్డర్ చేశా. ఇంతలో ఆర్డర్ తీసుకోవడానికి డెలివరీ బాయ్ అక్కడికి వచ్చాడు. అతడికి ఫోన్ చేసి ఇది నా ఆర్డరేనని, నన్ను రూం దగ్గర దింపమని అడిగాను. అతడు వెంటనే సరేనన్నాడు. ఆర్డర్‌తో పాటు నన్నూ డ్రాప్ చేశాడు. అంతేకాదు సార్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి ప్లీజ్ అని అడిగాడు. నేనూ సరేనన్నాను. ఉచిత ప్రయాణం అందించిన జొమాటోకు థాంక్స్’ అంటూ ఒబేశ్ తాను చేసిన ఫ్రీ రైడ్ గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
ఈ నెల 6న షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో.. నువ్వు కేక బ్రదర్. ఏమన్నా ఐడియానా. హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ఒబేశ్ తెలివితేటలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో జొమాటో కూడా ఒబేశ్ పోస్టుపై స్పందించింది. ‘ సరికొత్త సమస్యలకు సరికొత్త పరిష్కారాలు’ అని జొమాటో కేర్ ట్వీట్ చేసింది. దీంతో ఒబేశ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్నపాటి స్టార్ అయిపోయాడు. మీకు కూడా ఒబేశ్ ఐడియా నచ్చింది కదూ!!
Modern problems require modern solutions. ^PC pic.twitter.com/2bmo7EMIpu
— Zomato Care (@zomatocare) August 6, 2019
Comments
Please login to add a commentAdd a comment