మా ఆకలి వాయిదా.. బ్యాచిలర్స్‌ ఇబ్బంది పెడతారు | Online Food Delivery Portals Running Success in Hyderabad | Sakshi
Sakshi News home page

'ఆన్‌లైన్‌'లో 'ఆహ'రం..

Published Sat, May 11 2019 6:55 AM | Last Updated on Wed, May 15 2019 8:46 AM

Online Food Delivery Portals Running Success in Hyderabad - Sakshi

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి డిమాండ్‌ పెరుగుతోంది. యాప్స్‌ అందుబాటులోకిరావడంతో ఆన్‌లైన్‌లో క్లిక్‌ చేస్తే చాలు ఇంటికే ఆహారం వచ్చేస్తోంది. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్‌.. ఇలా ప్రతిదీ సిటీజనులు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో ప్రతినెలా 15లక్షలకు పైగా ఆర్డర్లుఅందుతున్నాయి. వీటిలో దాదాపు 85శాతం బిర్యానీ ఆర్డర్‌లే ఉండడం విశేషం. అందులోనూ ఎక్కువ మంది చికెన్‌ బిర్యానీకే ఓటేస్తున్నారు. ఉదయం 7–10గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12–3గంటల వరకు లంచ్‌ ఆర్డర్లువస్తుండగా... సాయంత్రం స్నాక్స్, అర్ధరాత్రి 2:30గంటల వరకు డిన్నర్‌ ఆర్డర్లు ఉంటున్నాయి. ఇది తమకు ఉపాధి మార్గంగా ఉపయోగపడుతోందని డెలివరీ బాయ్స్‌ పేర్కొన్నారు. చదువుకుంటూ కొందరు, ఉద్యోగాలు చేస్తూ మరికొందరు డెలివరీ బాయ్స్‌గా ఆదాయం పొందుతున్నారు. వీరు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకుసంపాదిస్తున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: ఎంతోమంది ఆకలి తీర్చే విధి నిర్వహణ వాళ్లది. ఆర్డర్‌ రాగానే ఉరకాల్సిందే. ఆ క్షణంలో వారు తమ ఆకలిని మరిచిపోతారు. ఆర్డర్లు అందిన వెంటనే సదరు హోటల్‌కు వెళ్లి ఆహార పదార్థాలను తీసుకుని ఆర్డర్‌ వచ్చిన చోట వాలిపోతారు. కస్టమర్‌కు ప్యాకెట్‌ అందించాక ఓ చిన్న కోరిక కోరతారు.. అది టిప్‌ ఇవ్వమని కాదు.. ‘సార్‌.. సర్వీస్‌ రేటింగ్‌ చూసి ఇవ్వండి’ అంటూ వినయంగా అడుగుతారు. వారే ‘ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌’. పెరుగుతున్న నగర జనాభా.. తీరిక లేని జీవితం ఫలితంగా చాలామంది గ్రేటర్‌ వాసులు ఇంటి భోజనం మరిచిపోతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ వ్యాపారం ఊపందుకుంది. ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఫుడ్‌ డెలివరీ ఉపాధిగా మారింది. ఉన్నతమైన చదువులు చదివినప్పటికీ సరైన ఉద్యోగవకాశాలు లభించని వారు ఇప్పుడు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా మారిపోయారు. జొమాటో, స్విగ్గీ, ఫుడ్‌ పాండా, ఉబర్‌.. వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ మొబైల్‌ యాప్స్‌ ఒకవైపు నగరవాసుల ఆకలి తీరుస్తూ మరోవైపు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకలేసినా, దాహమేసినా, గరం గరం ఇరానీ చాయ్‌ సిప్‌ చేయాలనిపించినా, కరకరలాడే స్నాక్స్‌ ఆరగించాలన్నా ఇప్పుడు అన్నింటికీ మొబైల్‌ ఫుడ్‌ యాప్‌లు మేమున్నాయంటున్నాయి. ఇంటికి బంధుమిత్రులొచ్చినా, మరే అత్యవసరమైనా సరే అప్పటికప్పుడు వంట చేయాల్సిన పనిలేదు. మొబైల్‌ ఫోన్‌ అందుకొని ఆర్డర్‌ బుక్‌ చేస్తే చాలు కొరుకున్నవన్నీ వచ్చేస్తాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి నెలా సుమారు 15 లక్షలకు పైగా ఆర్డర్లు ఇలాగే బుక్‌ అవుతున్నట్లు అంచనా. ఈ ఆర్డర్లలో 85 శాతానికి పైగా బిర్యానీలే ఉంటున్నాయి. అందులోనూ ఎక్కువ మంది చికెన్‌ బిర్యాని పట్ల ఆసక్తి చూపుతున్నారు. అటు వినియోగదారులకు, ఇటు ఫుడ్‌ డెలివరీ బాయ్‌లకు చక్కటి అవకాశంగా మారిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

ఆహారంలో అగ్రస్థానం బిర్యానీదే
‘ఇంటి వద్దకే భోజనం’ డిమాండ్‌లో చికెన్‌ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డిమాండ్‌ను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. బిర్యానీ తర్వాత చికెన్‌ 65, కబాబ్, పలావ్‌ వంటివి ఉన్నాయి. నగరవాసులతో పాటు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా బిర్యానీకే మొగ్గుచూపుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసేటపుడు శాకాహారంతో పోలిస్తే మాంసాహారానికి అధిక డిమాండ్‌ ఉంటోందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. ఫుడ్‌ డెలివరీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా బీమా, కుటుంబానికి అత్యవసర వైద్యసేవలతో పాటు మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. డెలివరీ చేసే ఆర్డర్ల మేరకు చెల్లించే కమీషన్‌ ఉంటుంది. ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఇప్పుడు రెస్టారెంట్లతో ఒప్పందం మేరకు ఆఫర్లను సైతం అందిస్తున్నాయి. నగరంలో దాదాపు 3 వేల రెస్టారెంట్లు స్విగ్గీ, ఫుడ్‌ పాండా, జోమాటో లాంటి సంస్థలతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. పేరున్న హోటళ్లు టేక్‌ అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.

ఐపీఎల్‌ సీజన్‌లో స్విగ్గీకి ఫుల్‌..
ఐపీఎల్‌ సీజన్‌లో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వెల్లువెత్తినట్లు సంస్థ తాజా ప్రకటనలో తెలిపింది.  
ప్రధానంగా చికెన్‌ బిర్యానీకి దేశంలోని పలు మెట్రో నగరాలతో పాటు పలు నగరాల్లోనూ ఆర్డర్లు 30 శాతం మేర పెరిగినట్లు ప్రకటించింది. ఇక ఏపీలోని విజయవాడ, కడప, తెలంగాణాలోని నిజామాబాద్‌ నగరంలోనూ స్విగ్గీకి ఆర్డర్లు భారీగా పెరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది.  
ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగిన రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య తమ ఆర్డర్లలో 30 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది.
పిజ్జాలు, సమోసాలు, చికెన్‌ వింగ్స్‌కు సైతం భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయట.
బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్డర్లు భారీగా పెరిగినట్లు పేర్కొంది.
గులాబ్‌ జామూన్, రస్‌మలాయ్, డబల్‌ కా మీఠా, బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌ వంటి స్వీట్స్‌కు కూడా గిరాకీ అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది.  

ఇడ్లీ నుంచి పెరుగన్నం వరకు..
నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేవరకు తినే అన్ని రకాల ఆహార పదార్థాలు ఆన్‌లైన్‌ ఆర్డర్లపై వచ్చేస్తున్నాయి. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అల్పాహారం కోసం ఆర్డర్లు మొదలువుతాయి. ఇడ్లీ, దోశ, చపాతీ, వడ, చాయ్, కాఫీ, వాటర్‌ బాటిళ్ల కోసం డిమాండ్‌ ఉంటుంది. బ్యాచిలర్స్, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైన కుటుంబాల్లో ఉదయం లేచిన వెంటనే అల్పాహారం కోసం ఆర్డర్‌ ఇస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు లంచ్‌ కోసం ఆర్డర్లు ఉంటాయి. ఎక్కువ శాతం నచ్చిన ఫుడ్డు బుక్‌ చేసుకుంటారు. అందులోనూ నగరవాసులు బిర్యానీకే పెద్ద పీట వేస్తున్నారు. ఆఫీస్‌లలో పార్టీలకు, ఇళ్లల్లో చిన్న చిన్న వేడుకలకు ఆర్డర్లపైనే ఫుడ్, స్వీట్లు, కూల్‌ డ్రింక్స్‌ వచ్చేస్తున్నాయి. ఒకటేంటి.. సౌత్‌ ఇండియన్, నార్త్‌ ఇండియన్‌ డిషెష్, పెరుగన్నం.. పులిహోర వరకు ఆర్డర్లు ఇస్తున్నారు. ‘ఫోన్‌లో యాప్‌ ఆన్‌ చేస్తే చాలు ఆర్డర్లు వచ్చి పడుతూనే ఉంటాయి. మధ్యాహ్నం పూట మాకు అన్నం తినే అవకాశం ఉండదు. ఆర్డర్లు అన్నీ డెలివరీ అయ్యాక 3 గంటల తర్వాతే భోజనం చేస్తాం’ అని ఎల్‌బీనగర్‌కు చెందిన డెలివరీ బాయ్‌ శివప్రసాద్‌ తెలిపాడు. ప్రతిరోజు 25 ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇతడు రోజుకు రూ.600 నుంచి రూ.1000 వరకు ఆదాయం వస్తుందని, అయితే, అన్ని రోజుల్లో ఆర్డర్లు ఒకేలా ఉండవన్నాడు. వీకెండ్స్‌లో ఉండే డిమాండ్‌ ఇతర రోజుల్లో ఉండకపోవచ్చు. సాధారణంగా టిఫిన్‌లకు ఎక్కువగా కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయి. ఏ హోటల్‌కు ఎంత రేటింగ్‌ ఉందనే సమాచారం ఆధారంగా ఆర్డర్లు ఉంటాయని డెలివరీ బాయ్స్‌ చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనాలతో పాటు రాత్రి భోజనాలకు కూడా ఆర్డర్‌లు నగరంలో బాగానే చేస్తున్నారు. అందులోనూ మధ్యాహ్నం కంటే రాత్రిళ్లు రద్దీ ఎక్కువగా ఉండడం విశేషం. ఇక మిడ్‌నైట్‌ బిర్యానీ ప్రియులు ఉండనే ఉన్నారు. అర్ధరాత్రి దాటాక 2.30 వరకూ డెలివరీ బాయ్స్‌ సేవలు అందిస్తునే ఉంటున్నారు.

డెలివరీ ఉపాధి బాగుంది
నాగర్‌ కర్నూలుకు చెందిన శివప్రసాద్‌ ఒక కొరియర్‌ సంస్థలో  10 ఏళ్ల పాటు పనిచేశాడు. నెల జీతం రూ.15వేలు దాటలేదు. ‘ఏడాది క్రితం ‘జొమొటో’లో చేరాను. నాటి నుంచి ప్రతి నెలా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా. ఒకఆర్డర్‌పై రూ.40 చొప్పున ఇస్తున్నారు. రోజుకు 25 ఆర్డర్లు డెలివరీ చేస్తే రూ.1000 లభిస్తుంది. టార్గెట్‌ ప్రకారం ఆర్డర్లు చేసిన వాళ్లకు ఫుడ్‌ డెలివరీ సంస్థలు ప్రోత్సాహకాలను కూడా ఇస్తాయి. ఆహార సరఫరా సంస్థల్లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌ ఉద్యోగులుగా కమీషన్‌ ప్రాతిపదికపై వేలాది మంది పనిచేస్తున్నారు. చదువుకుంటూ కొందరు ఉపాధి పొందున్నారు. గత ఉద్యోగాలతో పోలిస్తే ఇక్కడ వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండటంతో మరికొందరు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. సగటున 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పైబడిన వారు కూడా ఫుడ్‌ డెలివరీ విధుల్లో ఉన్నారు. సొంత వాహనం, డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీ ఉంటే చాలు.. ఉద్యోగం వచ్చినట్లే. సూర్యాపేట్‌కు చెందిన నగేష్‌ ఒక ట్రావెల్స్‌లో  డ్రైవర్‌గా పని చేసేవాడు. ‘రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా రూ.12 వేలు కూడా వచ్చేది కాదు. పైగా డ్రైవింగ్‌ చాలా రిస్క్‌. ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి డెలివరీ బాయ్‌ ఏదో ఒక జోన్‌కు మాత్రమే పరిమితమవుతాడు. ఆ జోన్‌లో 10 కిలోమీటర్ల మేర ఫుడ్‌ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్లకు ఒక జోన్‌ మారుతూ ఉంటుంది. ఏ జోన్‌ వాళ్లు అక్కడే పని చేస్తారు. జోన్‌లో మార్పులు టీమ్‌ లీడర్లపై ఆధారపడి ఉంటాయి. ప్రతి 3, 4 జోన్లకు కలిపి ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు టీమ్‌ లీడర్లుగా వ్యవహరిస్తారు.  

  • పలు మెట్రో నగరాల్లో ఐపీఎల్‌ సీజన్‌లోఆర్డర్లు వెల్లువెత్తిన వంటకాలివే..
  • చెన్నై, కోల్కతా: చికెన్‌ బిర్యానీ, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌
  • బెంగళూరు: మసాలా దోశ, చికెన్‌ వింగ్స్‌
  • ఢిల్లీ: దాల్‌ మఖానీ, పిజ్జా, సమోసా
  • ముంబై: దాల్‌ కిచిడీ
  • హైదరాబాద్‌: చికెన్‌ బిర్యానీ, కబాబ్స్‌  

మా ఆకలి వాయిదా
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టిఫిన్‌లు, లంచ్‌ వరుసగా ఆర్డర్లుంటాయి. దీంతో మాకు తినేందుకు తీరిక ఉండదు. మధ్యాహ్నం 3 తర్వాతే భోజనం చేస్తాం. ఒక్కోసారి మిర్చీలు, బజ్జీలు, సమోసాలతో కడుపునింపుకుంకొని డెలివరీ ఇస్తున్నాం. బ్యాచిలర్స్‌ కొద్దిగా ఇబ్బంది పెడతారు. వారు ఒక ఆర్డర్‌ ఇచ్చి డెలివరీ మరొకటి అడుగుతారు. వాపస్‌ చేస్తారు. అలాంటప్పుడు ఆ నష్టం మేం భరించాల్సి వస్తుంది.    – శివప్రసాద్, జొమొటో

లస్సీ ఆర్డర్లు వస్తున్నాయి  
వేసవి కావడం వల్ల లక్సీకి ఆర్డర్లు ఇస్తున్నారు. బిర్యానీకి డిమాండ్‌ బాగా ఉంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 15 పార్శిళ్లను డెలివరీ చేశాను. ఇందులో ఆరు పార్శిళ్లు బిర్యానీ. మూడు లస్సీ ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లోని చట్నీస్‌ హోటల్‌ నుంచి మూడు వెజ్‌ లంచ్‌బాక్స్‌లు సరఫరా చేశాను. రెండు చోట్ల కూల్‌డ్రింక్‌ అందజేశాను. లంచ్‌లో ఎక్కువగా బిర్యానీలు పంపిణీ చేశాను.     – మనోహర్, డెలివరీ బాయ్‌

అర గంటకే డెలివరీ
ఇష్టమైన ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే అరగంటలో డెలివరీ ఇస్తాం. ప్రతి రూ.900 బుకింగ్‌ ఆర్డర్‌పై రూ.300 వరకు కమీషన్‌ వస్తుంది. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్‌ ఫుడ్, జంక్‌ ఫుడ్స్‌పై ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం మిల్క్, థిక్‌షేక్, బాదం పాలు, ఫ్రూట్‌ సలాడ్‌ వంటి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్డర్లు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం విరామం తీసుకుంటాం.    – యశ్వంత్, స్విగ్గీ డెలివరీ బాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement