వీడియోలోని దృశ్యాల ఆధారంగా చిత్రం
పారిస్: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితి నెలకొనటం సహజం. కానీ, కొందరు మాత్రం సమయస్ఫూర్తిని, తెగువను ప్రదర్శిస్తుంటారు. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా కూడా అదే జాబితాలోకి వస్తాడు. ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడి సూపర్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆదివారం ఉత్తర ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
నాలుగేళ్ల బాబు తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు వేలాడటం కొందరు స్థానికులు గమనించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అంచుల నుంచి వేలాడుతున్న ఈ చిన్నారి ఎప్పుడైనా కిందపడి పోయేలా పరిస్థితి నెలకొంది. కింద జనం చేరి హాహాకారాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మమౌడూ గస్సామా క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకాడు. గబగబా పైకి భవనం ఎక్కడి ఆ పిల్లాడిని కాపాడే యత్నం చేశాడు. ఆ సమయంలో పక్క ప్లాట్‌లోని వ్యక్తి చిన్నారి జారకుండా ఒకచేత్తో అదిమి పట్టుకున్నాడు. నిమిషం వ్యవధిలోనే పైకి ఎక్కేసిన గస్సామా.. ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు. కాసేపటికి వచ్చిన అధికారులు చిన్నారి సురక్షితంగా ఉన్నాడని తెలిసి ఆ యువకుడిని అభినందించి వెళ్లిపోయారు. గస్సామా సాహసంపై పారిస్ మేయర్ ప్రశంసలు గుప్పించగా, సోషల్ మీడియాలో అతన్ని హీరోగా, స్పైడర్ మ్యాన్‌గా అభివర్ణిస్తున్నారు. మాలి నుంచి పారిస్‌లో స్థిరపడదామని వచ్చిన అతనికి అన్ని తోడ్పాట్లు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇంట్లో ఒంటిరిగా ఉన్నాడు... ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు నిర్ధారించారు. పిల్లాడి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు అతని తల్లి ఊళ్లో లేదని తెలుస్తోంది.
‘ఆ క్షణంలో ఆ చిన్నారిని అలా చూసేసరికి భయం వేసింది. వణికిపోయా. ప్రజలంతా కేకలు పెడుతున్నారే తప్ప.. ఒక్కరూ కూడా తెగించే ధైర్యం చేయలేదు. ఫైర్ సిబ్బంది రావటానికి సమయం పడుతుందని అనిపించింది. ఇంతలోపే ఆ చిన్నారికి ఏమైనా జరిగితే ఎలా?.. మరో ఆలోచన రాలేదు. దుకే ఈ పని చేశా’ అని గస్సామా చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment