
జంతువులను వీక్షించడానికి సఫారీకి వచ్చిన పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది. జీపులో వెళ్తున్న వారిపై ఏనుగు ఒక్కసారిగా విరుచుకుపడింది. కోపంతో పరుగులు తీస్తూ తొండంతో జీపును తోసేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన పర్యాటకులు అంతేవేగంగా స్పందించి రివర్స్‌లో వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది.
కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘సఫారీ వెళ్లినపుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదు. మీరు అదృష్టవంతులు. అందుకే ప్రాణాలతో బయటపడ్డారు’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా... మరికొందరు మాత్రం... ‘ఏనుగులతో సెల్ఫీలు దిగాలి. సింహంతో ఆడుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు తప్పవు మరి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.