
తమిళసినిమా: ఐపీఎల్ సందడికి టైమ్ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ మొదలు కానుంది. 51 రోజులు ఐపీఎల్ క్రికెట్ క్రీడాభిమానుల్ని ఎంటర్‌టెయిన్ చేయనుంది. ఈ క్రీడా వేదిక ఆరంబమే అదుర్స్ అనేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. శనివారం ముంబైలో ఈ క్రీడా పోటీల ప్రారంభ వేడుకలో మీల్కీబ్యూటీ తమన్నా ఆకర్షణ కానున్నారు. అవును ఈ బ్యూటీ తన ఆటా పాటతో క్రీడా ప్రియుల్ని మైమరపించనున్నారు.
ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్‌పై ఆడి పాడి అందాలు కుమ్మరించిన తమన్నా ఇప్పుడు బహిరంగ వేదికపై స్టెప్స్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు ఈ అమ్మడు భారీ మొత్తంలోనే పారితోషికాన్ని అందుకుందని సమాచారం. సాధారణంగా ఈ ప్రారంభోత్సవ వేడుకకు పోటీల్లో పాల్గొనే అన్ని జట్ల కెప్టెన్లకు ఆహ్వానం ఉంటుంది. అలాంటిది ఈ సారి ముంబై, చెన్నై జట్టు కెప్టెన్లకే ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది క్రికెట్ బోర్డు నిర్వాహకులకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తీసుకున్న నిర్ణయం అట. ఈ వేదికపై నటి తమన్నాతో పాటు మరికొందరు బాలీవుడ్ బ్యూటీస్ ఆకర్షణగా నిలవనున్నారు. వారి అందాలతో చిందేసి ఆహూతులకు కనువిందు చేయనున్నారు. ఐపీఎల్ వేడుకలో మీల్కీబ్యూటీ సందడి చేయనుండడం ఇదే మొదటిసారి.