ఇరుట్టు అరైయిల్ మొరట్టుకుత్తు చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు చిత్రంలో ఎలాంటి సందేశాన్ని ఆశించొద్దని ఆ చిత్ర దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ తెలిపారు. ఈయన హరహర మహాదేవకీ చిత్రం ద్వారా పరిచయం అయిన దర్శకుడన్నది గమనార్హం.ఆ చిత్ర నిర్మాణ సంస్థ బ్లూ ఘోస్ట్ పిక్చర్స్‌నే నిర్మిస్తున్న చిత్రం ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు. అదే విధంగా ఆ చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్‌నే ఈ చిత్రంలోనూ హీరోగా నటించారు. ఇక హీరోయిన్లుగా వైభవి శాండిల్య, యాషిక ఆనంద్, చంద్రిక రవి ముగ్గురు నటించారు. బాలమురళీ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మే 4వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ విలేకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను 23 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. ఇది అడల్ట్ హర్రర్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని, అందువల్ల ఇందులో ఎలాంటి సందేశాన్ని ప్రేక్షకులు ఆశించరాదని అన్నారు. రెండు గంటల పాటు జాలీగా ఎంజాయ్ చేయవచ్చునని అన్నారు. మా చిత్రాన్ని ఎంటర్‌టెయియినర్‌గానే చూడాలని కోరుకుంటున్నామన్నారు. ఇక హీరో గౌతమ్ కార్తీక్ విషయానికి వస్తే ఆయనకు ఈ చిత్ర కథ గురించి ఏం చెప్పానో, ఆయన ఏం విన్నారో తనకే తెలియదన్నారు. చిత్రం యూనిట్ అంతా కలిసి చేసిన చిత్రం ఇదని చెప్పారు. చిత్ర హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్ అని అన్నారు. అందరం కూర్చుని చర్చించుకుని చిత్రం చేశామని తెలిపారు. ఇలాంటి అడల్ట్ హర్రర్ కథా చిత్రంలో నటించడంపై మీ తండ్రి కార్తీక్ ఎలా స్పందించారు? అన్న ప్రశ్నకు నాన్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఆసక్తిగా ఉన్నారని బదులిచ్చారు. ఇదే సంస్థలో దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కల్పించిన నిర్మాత జ్ఞానవేల్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గౌతమ్‌కార్తీక్ అన్నారు. నటి ఆషిక ఆనంద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment