తమిళసినిమా: కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీత సందడి చేశారు. నటుడు, దర్శకుడు పార్తీపన్, నటి సీత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కీర్తన, అభినయ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలం తరువాత మనస్పర్థల కారణంగా పార్తీపన్, సీత విడాకులు పొందారు. పెద్దకుమార్తె కీర్తన తండ్రి పార్తీపన్ వద్ద, చిన్న కుమార్తె అభియన తల్లి సీత వద్ద పెరుగుతున్నారు. కాగా పార్తీపన్ మరో ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఈ విషయం అటుంచితే పార్తీపన్ తన కూతురు కీర్తనకు వివాహం నిశ్చయించారు. మార్చి 8న కీర్తన పెళ్లి జరగనుంది. మరి కీర్తన పెళ్లికి ఆమె తల్లి సీత వస్తారా? అన్న ప్రశ్న కోలీవుడ్‌లో తలెత్తింది.
సీత పెళ్లిలో పాల్గొంటుంది
ఈ విషయంలో పార్తీపన్ క్లారిఫై చేసే విధంగా.. కీర్తన పెళ్లి వేడుకలో సీత పాల్గొంటుందని ఇటీవల మీడియాకు ఇచ్చిన భేటీలో తెలిపారు. జీవిత పయనంలో ఎలాంటి బంధానికైనా దూరం అవటం తప్పదన్నారు. అయితే తల్లి కూతుళ్ల బంధానికి అది అతీతం అని పేర్కొన్నారు. కాబట్టి కీర్తన పెళ్లి వేడుకలో ఆమె తల్లి సీత పాల్గొంటుందని చెప్పారు. తన కూతురు పెళ్లి మహిళా దినోత్సవం రోజున జరగనుందని, మహిళలకు ప్రాధాన్యత కలిగిన ఆ రోజున జరిగే కీర్తన పెళ్లి వేడుకకు ఆమె తల్లి, పెళ్లి కొడుకు అక్షయ్ తల్లి అంటూ చాలా మంది తల్లులు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం జరిగిన కీర్తన వివాహ నిశ్చితార్థ వేడుకలో నటి సీత సంతోషంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment