
తమిళసినిమా: మన సూపర్‌స్టార్స్, స్టార్స్ మలేషియాలో ఆటాపాటా, క్రీడా పోటీలతో మస్త్ సందడి చేస్తున్నారు. ఇది అక్కడి తమిళ ప్రేక్షకులకు మజాను కలిగించే విషయమే. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణానికి నిధిని సేకరించే పనిలో భాగంగా సంఘ నిర్వాహకులు శనివారం మలేషియాలో స్టార్ క్రికెట్‌తో పాటు ఆటా,పాటా,చిత్రాల గీతాలావిష్కరణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీ కాంత్, విశ్వనటుడు కమలహాసన్‌లతో పాటు పలువురు సినీ కళాకారులు పాల్గొననున్నారు. మొత్తం 340 మంది నటీనటులు, ఇతర సినీ ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. మలేషియా ప్రభుత్వ సహకారంతో జరగనున్న ఈ నక్షత్ర క్రికెట్ పోటీల్లో జట్లు ఆడనున్నారు. ఈ జట్లకు విశాల్, సూర్య, కార్తీ, విజయ్‌సేతుపతి, జయంరవి, జీవా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. కాగా ఇప్పటికే 200 మంది కళాకారులు మలేషియా చేరుకోగా గురువారం రాత్రి చెన్నై నుంచి విమానం ద్వారా మలేషియా వెళ్లారు. ఆయనతో పాటు మరి కొంత మంది నటీనటులు వెళ్లారు. అక్కడ రజనీకాంత్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కాగా అమెరికాలో ఉన్న నటుడు కమల్ శనివారం ఉదయం మలేషియాకు చేరుకోనున్నారు. మలేషియాలోని బూకీజాలీ అరంగంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముందుగా స్టార్స్ క్రికెట్ నిర్వహించి, ఆ తరువాత ఆటా,పాటా, సినీ గీతాలావిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి.
విజయ్, అజిత్ డుమ్మా
కాగా ఈ కార్యక్రమానికి నటుడు విజయ్,అజిత్‌లు డుమ్మా కొట్టారు. సాధారణంగా నటుడు అజిత్ తన చిత్రాల ఆడియో ఆవిష్కరణ లాంటి ప్రచార కార్యక్రమాల్లోనే పాల్గొనరు. ఇక ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతారని ఎవరూ ఊహించరు.అయినా ఆయన్ని పాల్గొనమని కోరతామని సంఘ నిర్వాహకులు తెలిపారు. అయితే వారి ప్రయత్నం ఫలించినట్లు లేదు. కాగా నటుడు విజయ్ పాల్గొనక పోవడం విమర్శలకు దారి తీసింది. నిజానికి ఆయనకిప్పుడు షూటింగ్ కూడా లేదు. అజిత్ వెళ్లకపోతే నేనెందుకు వెళ్లాలన్న ఈగో కారణంగానే విజయ్ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టిఉంటారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా రజనీకాంత్,కమల్‌హాసన్ ఒకే వేదికపై పాల్గొననుండడంతో వారి మధ్య ఎలాంటి చర్చ జరగుతుందనే ఆసక్తి సినీ వర్గాల్లో, వారి అభిమానుల్లోనూ నెలకొంది. వారి మధ్య రాజకీయపరమైన చర్చ వస్తుందా? ఇద్దరూ రాజకీయంగా కలిసి నడిచే విషయమై చర్చలు జరుపుతారా? అన్న విషయం పై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment