
13 టెస్టులు... 31 వన్డేలు
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటివరకూ సారథ్యం వహించిన మ్యాచ్‌ల సంఖ్య 14. మన కొత్త సెలక్షన్ కమిటీలో మొత్తం అందరు సెలక్టర్లు కలిసి ఆడిన టెస్టులు 13. రేపు టెస్టు జట్టును ఎంపిక చేయడానికి కూర్చుంటే... ఓ ఆటగాడిని కోహ్లి బాగా విశ్లేషిస్తాడా..? సెలక్టర్లు బాగా విశ్లేషిస్తారా..? తాజా కమిటీ ఏర్పాటు ద్వారా ప్రస్తుత బీసీసీఐ పాలకులు కొత్త పోకడకు తెర లేపారు. తమకు కావలసిన వారిని ఇంతకాలం కమిటీల్లో నియమించడం వరకు మాత్రం చూశాం. ఇప్పుడు... సెలక్షన్ కమిటీకి కూడా ఈ జాఢ్యం పాకినట్లు కనిపిస్తోంది.
సాక్షి క్రీడావిభాగం
ప్రపంచంలో అత్యంత బలమైన క్రికెట్ జట్టును ఎంపిక చేయాలంటే అంతే బలమైన వ్యక్తులు సెలక్షన్ కమిటీలో ఉండాలి. ముఖ్యంగా చీఫ్ సెలక్టర్ పేరు వింటే ఎంత సీనియర్ ఆటగాళ్లైకైనా అపార గౌరవంతో పాటు ఎంతో కొంత భయం ఉండాలి. గతంలో బీసీసీఐలో ఎవరు అధికారంలో ఉన్నా సెలక్షన్ కమిటీ ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్తగానే వ్యవహరించారు. దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్, సందీప్ పాటిల్... ఇలా ఇటీవలి చీఫ్‌లంతా గతంలో ఘనమైన క్రికెట్ చరిత్ర ఉన్నవారే. అందుకే ప్రస్తుత తరం ఆటగాళ్లకు వాళ్లంటే గౌరవంతో పాటు ఎంతో కొంత భయం ఉండేది. కానీ బీసీసీఐ తాజాగా ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ చూస్తే క్రికెట్ తెలిసిన వాళ్లెవరైనా ఆశ్చర్యపోతారు. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ చరిత్ర ఉన్న క్రికెటర్ కాదు. ఎవరికీ అనుభవం లేదు. మరి బోర్డు వీళ్లని ఎలా ఎంపిక చేసింది? ఇంటర్వూలో ఏం అడిగి వీళ్లని ఎంపిక చేశారో తెలియదు?
అనుభవం లేదు
ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపికై న ఎమ్మెస్కే ప్రసాద్ 6 టెస్టుల్లో 106 పరుగులు, 17 వన్డేల్లో 131 పరుగులు చేశాడు. దేవాంగ్ గాంధీ కేవలం నాలుగు టెస్టులు, మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. పరాంజపేకు నాలుగు వన్డేల అనుభవం మాత్రమే ఉంది. శరణ్ దీప్ కేవలం మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. ఖోడా కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. వీళ్లంతా కలిపి ఆడింది 13 టెస్టులు, 31 వన్డేలు. ఈ అనుభవం ఓ సెలక్షన్ కమిటీకి సరిపోతుందా అనేది ప్రశ్నార్థకం.
ఎవరు చెప్పగలరు?
చీఫ్ సెలక్టర్‌గా ఉండే వ్యక్తి ఎవరైనా ఎంత పెద్ద నిర్ణయాన్నైనా చెప్పగలిగి ఉండాలి. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నాడు. ఒకవేళ ప్రపంచకప్‌కు ముందు ధోని సరిగా ఆడకపోతే తప్పించే ధైర్యం కానీ, తప్పిస్తున్నామని చెప్పే శక్తిగానీ ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరికీ లేదు. నిజానికి సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఒక తెలుగు వ్యక్తి ఎంపిక కావడం గర్వకారణమే అరుునా... భారత క్రికెట్ స్థాయి, పరిస్థితుల దృష్ట్యా ఇది అంత గొప్ప నిర్ణయం కాదు. కోహ్లి ఇప్పటివరకూ 45 టెస్టులు ఆడాడు. అందులో 14 మ్యాచ్‌లకు కెప్టెన్. ఇక తను ఆడిన మొత్తం అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 261. సెలక్షన్ కమిటీ సమావేశాలకు కెప్టెన్ కూడా హాజరవుతాడు. ఓ ఆటగాడి స్థాయిని ఫామ్‌ని కోహ్లి కంటే ప్రస్తుత సెలక్టర్లు ఎక్కువగా అంచనా వేయలేరనేది కాదనలేని అంశం.
కావలసిన వాళ్లకు ఇచ్చేశారా?
గతంలో బీసీసీఐలో ఎవరు అధికారంలో ఉన్నా తమకు కావలసిన వారిని కమిటీల్లో పదవులు ఇవ్వడం ద్వారా సంతృప్తి పరిచేవారు. తర్వాతి ఎన్నికల్లో తమవైపు నిలబడేందుకు పదవులు ఇచ్చేవారు. కానీ సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదు. తాజాగా అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఏ మాత్రం హర్షించలేం. సెలక్టర్లను డమ్మీలను చేసి జట్టు ఎంపికను కూడా పూర్తిగా చేతుల్లోకి తీసుకోవాలనే ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. దీనికంటే అసలు సెలక్షన్ కమిటీ లేకుండా బోర్డు జట్టును ఎంపిక చేసే ప్రక్రియ తీసుకున్నా బాగుండేదేమో..! ఏమైనా భారత క్రికెట్‌కు ఇది ఎంత మాత్రం మేలు చేసే పరిణామం కాదు.