సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు పలు హోదాల్లో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఎన్.శివలాల్‌యాదవ్ ఇకపై బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో జరగనున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు.. శివలాల్‌ను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ మినహా ఇతర బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న శివలాల్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే ఆ తరువాత అటు బీసీసీఐతోపాటు, ఇటు హెచ్‌సీఏలోనూ ఇకపై ఏ పదవినీ చేపట్టరాదని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆటగాడిగా క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన శివలాల్.. రిటైరయ్యాక తొలిసారిగా 1990లో కార్యవర్గ సభ్యుడిగా హెచ్‌సీఏలో అడుగుపెట్టారు. ఆ తరువాత 1992లో సంయుక్త కార్యదర్శిగా, 2000లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
2010 నుంచి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ 24 ఏళ్లుగా హెచ్‌సీఏ వ్యవహారాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆటగాడి నుంచి భారత క్రికెట్‌లో అత్యున్నతమైన బీసీసీఐ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన తాను తిరిగి కింది స్థాయి పదవి కోసం పోటీ పడడం సరికాదన్న అభిప్రాయంతో శివలాల్ యాదవ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెచ్‌సీఏ కోరితే సలహాదారుడిగా సేవలందించాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం అకాడమీ ఏర్పాటు చేయడం వంటి ఆలోచనేదీ లేదని, వర్ధమాన క్రికెటర్లెవరైనా కోరితే మాజీ ఆటగాడిగా వారికి సూచనలిచ్చే ఉద్దేశంతో 57 ఏళ్ల శివలాల్ ఉన్నట్లు చెబుతున్నారు.
హెచ్‌సీఏకు ఇక దూరం!
Published Wed, Apr 2 2014 11:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement