సాక్షి, హైదరాబాద్: రంజీ మాజీ క్రికెటర్ కన్వల్జిత్‌సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ) డెరైక్టర్ పదవి నుంచి ఆయనను తప్పిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది.
కన్వల్జిత్‌ను హెచ్‌సీఏఈ డెరైక్టర్ పదవిలో కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌సీఏఈ డెరైక్టర్ పదవి నుంచి తనను తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, అకాడమీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా హెచ్‌సీఏను ఆదేశించాలంటూ కన్వల్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్... కవల్జీత్‌సింగ్, బీసీసీఐ అధ్యక్షుడు శివలాల్‌యాదవ్ సోదరుడు వీరేందర్‌యాదవ్‌లకు మధ్య జరిగిన వివాదంపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఏర్పాటైన కమిటీని ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే విచారణ పూర్తి చేయకపోవడంతో కన్వల్జిత్‌సింగ్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విధించిన కాల వ్యవధిలోపు విచారణ పూర్తి చేయలేదు కాబట్టి, ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఇంకా కొనసాగించడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆ మేరకు కన్వల్జిత్‌ను హెచ్‌సీఏఈ డెరైక్టర్ పదవి నుంచి తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు. అంతేకాక నెలలోపు విచారణ పూర్తి చేయాలని కమిటీని మరోసారి ఆదేశించారు.