సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అపరిమిత అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తేల్చింది. ఆర్థికాంశాల్లో ఉల్లంఘనలు.. అకౌంటింగ్, ఆడిటింగ్‌కు అందని లెక్కలు... టెండర్ల మాటే లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన పనులు.. ఇలా ప్రతీ చోట జరిగిన కోట్ల రూపాయల అక్రమాలను ఏసీబీ బట్టబయలు చేసింది. 2003-04 నుంచి 2010-11 మధ్య కాలానికి సంబంధించి జరిగిన పనులపై ఏసీబీ విచారించింది.
మూడేళ్ల విచారణ అనంతరం వెల్లడైన అంశాలతో ఏసీబీ అధికారులు హెచ్‌సీఏ మాజీ ఆఫీస్ బేరర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు 17 మందికి శనివారం నోటీసులు అందజేశారు. మొత్తం 199 అంశాలలో అవినీతిని ప్రస్తావిస్తూ ఏసీబీ ఈ నోటీసును ఇవ్వడం విశేషం. వీటిలో తమ పాత్ర, తెలిసిన సమాచారం వివరాలతో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. లేదంటే వారి పాత్రను నిర్ధారిస్తూ, అందుబాటులో ఉన్న సమాచారంతోనే ముందుకు సాగుతామని చెప్పింది. నోటీసులోని కొన్ని అంశాల్లో హెచ్‌సీఏ అవినీతిని పరిశీలిస్తే...
చెక్‌లు లేకుండా రూ. 14 కోట్లు నగదు చెల్లింపులే.
ఇన్‌స్టేడియా రైట్స్ కోసం టెండర్లు, కొటేషన్లు లేకుండా రెండుసార్లు రూ. 2 కోట్ల 20 లక్షలు తీసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణోత్సవం సందర్భంగా సభ్యులకు రూ. 49 లక్షల విలువైన బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు.
నిజామాబాద్‌లో రూ. 40 లక్షలతో కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఎలాంటి పత్రాలూ లేవు.
బ్యాంకుల్లో రూ. 55 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని చెబుతున్న హెచ్‌సీఏ... వాటికి సంబంధించి పత్రాలు లేవు.
కోచ్‌లు, సెలక్టర్లకు చెల్లించామని చెబుతున్న రూ. 1 కోటి 30 లక్షల వివరాలు లేవు. ప్రోత్సాహకాలుగా చెప్పిన రూ. 59 లక్షల పరిస్థితి అంతే.
ఆడిట్‌కు సమర్పించకుండా వోచర్ల ద్వారా చేసిన చెల్లింపులు రూ. 2 కోట్ల వరకు ఉండటం గమనార్హం.
స్టేడియం నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున కంపెనీ ద్వారా రూ. నాలుగున్నర కోట్ల అదనపు సివిల్ పనులు జరిగాయి.
ఫ్లడ్‌లైట్ల కోసం బజాజ్ కంపెనీకి అదనంగా రూ. 1 కోటి చెల్లించారు. కనోపీ ఏర్పాటులో రూ. 36 లక్షల అవినీతి.
హెచ్‌సీఏ కాన్ఫరెన్స్ హాల్, క్లబ్ హౌస్ తదితర చోట్ల ఇంటీరియర్ వర్క్, ఫర్నిచర్‌ల విషయంలో దాదాపు రూ. రెండున్నర కోట్ల అవినీతి జరిగింది.
అడుగడుగునా అవినీతి!
Published Sun, Feb 9 2014 12:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement