జయవర్ధనే సెంచరీ: లంక 318/4
దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మహేల జయవర్ధనే (230 బంతుల్లో 106 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి... శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 4 వికెట్లకు 318 పరుగులు చేసింది. జయవర్ధనేతో పాటు మాథ్యూస్ (42 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లంక 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. 57/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంక ఆరంభంలో కాస్త ఇబ్బందిపడింది. స్వల్ప వ్యవధిలో సంగక్కర (26), చండిమాల్ (12) అవుట్ కావడంతో 88 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కుశాల్ సిల్వ (221 బంతుల్లో 95; 10 ఫోర్లు), జయవర్ధనేలు నిలకడగా ఆడుతూ క్రమంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి నాలుగో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ దశలో సిల్వను.... హఫీజ్ బోల్తా కొట్టించడంతో తృటిలో సెంచరీని కోల్పోయాడు. తర్వాత వచ్చిన మాథ్యూస్ వికెట్‌ను కాపాడుకుంటూ సమయోచితంగా ఆడాడు. నెమ్మదిగా ఆడినా... జయవర్ధనే కెరీర్‌లో 32వ సెంచరీ పూర్తి చేశాడు. మాథ్యూస్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. జునైద్ 2, రాహత్ అలీ, హఫీజ్ చెరో వికెట్ తీశారు.