రో‘హిట్టింగ్‌’తో ముగింపు | 5th ODI: India beat Australia to win series 4-1 | Sakshi
Sakshi News home page

రో‘హిట్టింగ్‌’తో ముగింపు

Published Mon, Oct 2 2017 1:31 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

5th ODI: India beat Australia to win series 4-1 - Sakshi

భారత్‌ మళ్లీ పంజా విసిరింది. పరాజయాన్ని ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేస్తూ తమదైన శైలిలో మరోసారి చెలరేగింది. గత మ్యాచ్‌ ఓటమికి తగిన రీతిలో జవాబిస్తూ సత్తా చాటడంతో సిరీస్‌లో మరో వన్డే మన ఖాతాలో చేరింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిన టీమిండియా ముందు నిలవలేక ప్రత్యర్థి ఆస్ట్రేలియా పూర్తిగా చేతులెత్తేసింది. భారీ విజయంతో సిరీస్‌ను ముగించిన కోహ్లి సేన నంబర్‌వన్‌ స్థానాన్ని సుస్థిరపర్చుకుంది. ఇక తదుపరి లక్ష్యం టి20 సిరీస్‌. రోహిత్‌ శర్మ మెరుపు సెంచరీ, రహానే కళాత్మక ఇన్నింగ్స్‌ 243 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు సునాయాసంగా మార్చేశాయి. ఈ ‘సియట్‌’ జోడి పిచ్‌పై వేగంగా దూసుకుపోయి వరుసగా మూడో మ్యాచ్‌లో శతక భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు శుభారంభం చేసి కూడా భారత స్పిన్‌ ద్వయం దెబ్బకు ఆస్ట్రేలియా కుదేలైంది. ఆసీస్‌పై వరుసగా మూడు సిరీస్‌లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రోహిత్, 6 వేల పరుగుల మైలురాయితో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు.   

నాగపూర్‌: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత్‌ అద్భుత రీతిలో ముగించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. గత మ్యాచ్‌లో బెంగళూరులో ఓటమి మినహా... చెన్నై, కోల్‌కతా, ఇండోర్‌లలో కూడా భారత్‌ నెగ్గింది. ఐదో వన్డేలో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (62 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... స్టొయినిస్‌ (63 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ట్రావిస్‌ హెడ్‌ (59 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. అక్షర్‌ పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 42.5 ఓవర్లలో 3 వికెట్లకు 243 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (109 బంతుల్లో 125; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) వన్డేల్లో 14వ సెంచరీ సాధించాడు. అజింక్య రహానే (74 బంతుల్లో 61; 7 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగో అర్ధ సెంచరీ చేయగా, విరాట్‌ కోహ్లి (55 బంతుల్లో 39; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన హార్దిక్‌ పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 7న రాంచీలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది.  

మిడిలార్డర్‌ తడబాటు...
ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ (36 బంతుల్లో 32; 6 ఫోర్లు) శుభారంభం అందించారు. తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన తర్వాత బుమ్రా పట్టు తప్పాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోవడంతో తన తర్వాతి మూడు ఓవర్లలో అతను 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒకే ఓవర్లో ఫించ్‌ కొట్టిన మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. పవర్‌ప్లేలో తొలి ఐదు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే చేసిన ఆసీస్‌ తర్వాతి ఆరు ఓవర్లలో 39 పరుగులు రాబట్టింది. అయితే ఫించ్‌ను అవుట్‌ చేసి 66 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని పాండ్యా విడదీశాడు. ఆ తర్వాత రెగ్యులర్‌ స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్‌తోపాటు పార్ట్‌టైమర్‌ కేదార్‌ జాదవ్‌ ఆస్ట్రేలియాను కట్టి పడేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. దాంతో తీవ్ర అసహనానికి గురైన స్మిత్‌ (16) జాదవ్‌ బౌలింగ్‌లో వికెట్‌కు అడ్డంగా ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. కొద్ది సేపటికే వార్నర్‌తో పాటు హ్యాండ్స్‌కోంబ్‌ (13)ను అక్షర్‌ అవుట్‌ చేయడంతో కంగారూల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ దశలో స్టొయినిస్, హెడ్‌ చక్కటి సమన్వయంతో ఆడుతూ ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. కుదురుకున్న ఈ జంట చివరి ఓవర్లలో చెలరేగడమే తరువాయి అని అనిపించినా... భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎనిమిది బంతుల వ్యవధిలో హెడ్, స్టొయినిస్‌ పెవిలియన్‌ చేరడంతో ఆసీస్‌ భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో షమీ, ఉమేశ్, చహల్‌ స్థానంలో భారత్‌ భువనేశ్వర్, బుమ్రా, కుల్దీప్‌లకు చోటు కల్పించింది.  

మళ్లీ అదే జోరు...
గత రెండు వన్డేల్లో భారత్‌కు శతక భాగస్వామ్యం అందించిన రహానే, రోహిత్‌ జోడి ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపును కొనసాగించి భారత్‌ విజయాన్ని సులభం చేసింది. ఆరంభంలో రహానే చకచకా పరుగులు సాధించగా, తొలి 14 బంతుల పాటు రోహిత్‌ పరుగే తీయలేదు! అయితే వరుసగా రెండు ఫోర్లతో ఖాతా ప్రారంభించిన రోహిత్‌ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పది ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 43 పరుగులకు చేరింది. హెడ్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టిన రోహిత్‌ 52 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా, ఆ వెంటనే 64 బంతుల్లో రహానే కూడా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అయితే కూల్టర్‌నీల్‌ బౌలింగ్‌లో రహానే ఎల్బీగా వెనుదిరగడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అంపైర్‌ నిర్ణయంపై రహానే రివ్యూ చేసినా ఫలితం దక్కలేదు. అనంతరం కోహ్లి సహకారంతో రోహిత్‌ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరు ఆసీస్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కూల్టర్‌నీల్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టి రోహిత్‌ 94 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కూల్టర్‌ తర్వాతి ఓవర్లో కూడా రోహిత్‌ మరో ఫోర్, సిక్స్‌ బాదాడు. భారత్‌ విజయానికి 20 పరుగులు కావాల్సిన స్థితిలో రోహిత్‌ను జంపా అవుట్‌ చేసి 99 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని ముగించాడు. అదే ఓవర్లో కోహ్లి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగ్గా... పాండే (11 నాటౌట్‌), జాదవ్‌ (5 నాటౌట్‌) 43వ ఓవర్లో మ్యాచ్‌ను ముగించారు.  
 

9 భారత్‌ తరఫున 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడు రోహిత్‌ శర్మ. ఐదో వన్డేతో స్వదేశంలో తక్కువ ఇన్నింగ్స్‌ (42)లలో 2 వేల పరుగుల మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా కూడా రోహిత్‌ నిలిచాడు. అతను ఓపెనర్‌గానే 4 వేల పరుగులు చేయడం విశేషం.   

నా దృష్టిలో ఇది పూర్తి సాధికారిక విజయం. అసలు లోపాలే కనిపించకుండా ఆడాం. నాలుగు మ్యాచ్‌లలో కూడా మాపై ఒత్తిడి నెలకొన్నా... దానిని అధిగమించి గెలవగలిగాం. ఈ సిరీస్‌ నుంచి మాకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. సిరీస్‌ గెలిచిన తర్వాత కూడా అంతే తీవ్రత, పట్టుదలతో ఆడేలా ఆటగాళ్లను ప్రోత్సహించడంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ విజయవంతమైంది. భువీ, బుమ్రా అద్భుతంగా ఆడితే... షమీ, ఉమేశ్‌ కూడా ఏకైక మ్యాచ్‌లో బాగా బౌలింగ్‌ చేశారు. బ్యాట్స్‌మెన్‌తో పాటు ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ హార్దిక్‌ పాండ్యా అవకాశాలు అందిపుచ్చుకొని మంచి ఉదాహరణగా నిలిచాడు. ఇంత మంది సమర్థులలో తుది 11 మందిని ఎంచుకోవడం కష్టమే అయినా...
ఇది సంతోషకర పరిణామమే.
– విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement