సిడ్నీ: ఆస్ట్రేలియా విమానం ఎక్కుతున్న సమయంలో కూడా జట్టు వైస్ కెప్టెన్ తమతో పాటు ఎందుకు రావడం లేదో కెప్టెన్‌కు తెలీదు! ఈ వ్యవహారంపై జట్టు సారథికి సమాచారం ఇవ్వాల్సిన బోర్డు ఏదీ చెప్పకుండా అన్ని విషయాలను దాచి పెట్టింది! భారత క్రికెట్‌కు సంబంధించి తాజా పరిస్థితి ఇది. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ గాయపడటం మొదలు ఇప్పుడు తొలి రెండు టెస్టులకు దూరం కావడం వరకు నెల రోజులుగా సాగుతున్న అతని ఫిట్‌నెస్ వివాదంలో ఇప్పుడు మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది.
అసలు రోహిత్ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. అసలు ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని అతను చెప్పడం ఈ వ్యవహారం ఎలా సాగిందో చెబుతోంది. టీమిండియా కెప్టెన్‌కు, బీసీసీఐకి మధ్య ఎలాంటి సమాచార లోపం ఉందో కూడా ఇది చూపిస్తోంది. రోహిత్ వ్యవహారానికి సంబంధించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు అతని మాటల్లోనే...
‘దుబాయ్‌లో సెలక్షన్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్‌లో గాయపడిన కారణంగా రోహిత్ శర్మ సెలక్షన్‌కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్‌కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. అయితే అది జరగలేదు. (289 రోజుల తర్వాత...)
మాతో రోహిత్ ఎందుకు ప్రయాణించడం లేదో మాకెవరికీ సమాచారం లేదు. దాని తర్వాత బోర్డు నుంచి అధికారికంగా ఒకే ఒక మెయిల్ వచ్చింది. అందులో రోహిత్ ఎన్‌సీఏలో ఉన్నాడని, అతని గాయాన్ని పర్యవేక్షిస్తున్నామని, నవంబర్ 11న మరింత స్పష్టత వస్తుందని రాసుంది. సెలక్షన్ కమిటీ సమావేశం జరిగిన రోజు నుంచి మొదలు పెడితే ఐపీఎల్ ముగిసి, ఎన్‌సీఏలో చేరే వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై పూర్తిగా స్పష్టత లోపించింది. అసలు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు వేచి చూడటమే సరైంది కాదు. అంతా గందరగోళంగా ఉందనేది వాస్తవం. రోహిత్ పరిస్థితికి సంబంధించి ఎంతో అనిశ్చితి నెలకొంది. ఎక్కడా స్పష్టత లేదు’
Comments
Please login to add a commentAdd a comment