
న్యూఢిల్లీ: గతేడాది రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును కేంద్ర క్రీడా శాఖ ‘పద్మభూషణ్’ పురస్కారం కోసం ప్రతిపాదించింది. ‘దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం కోసం సింధు పేరును మేం ప్రతిపాదించాం’ అని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2015లోనే ఆమె పద్మశ్రీ పురస్కారం పొందింది. వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2013, 2014) కాంస్యాలు సాధించిన 22 ఏళ్ల సింధు ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్‌ను కనబరుస్తోంది. గతేడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లతో పాటు గత నెలలో గ్లాస్గో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం అందుకుంది. ఇక ఈనెలలో కొరియా ఓపెన్ రూపంలో కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే మూడుసార్లు మకావు ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది భారత్‌లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఈ సూపర్ షో కారణంగా గత వారం తిరిగి ప్రపంచ రెండో ర్యాంకర్ స్థానాన్ని దక్కించుకుంది. 2014లో సింధు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్, ఇంచియోన్ ఆసియా గేమ్స్, ఉబెర్ కప్, ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు అందుకుంది.
క్రీడా శాఖకు కృతజ్ఞతలు...
‘పద్మభూషణ్’ కోసం తన పేరును ప్రతిపాదించడంపై తెలుగు తేజం సింధు సంతోషం వ్యక్తం చేసింది. ‘పద్మభూషణ్‌కు నా పేరును ప్రతిపాదించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో కేంద్ర క్రీడా శాఖకు కృతజ్ఞతలు’ అని ఈ హైదరాబాదీ ప్లేయర్ తెలిపింది. అలాగే సింధు తండ్రి పీవీ రమణ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు.