దక్షిణాఫ్రికా ఆధిపత్యం
ఆసీస్‌తో రెండో టెస్టు
డివిలియర్స్, డుమిని సెంచరీలు
పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. డివిలియర్స్ (232 బంతుల్లో 116; 14 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (231 బంతుల్లో 123; 14 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150.5 ఓవర్లలో 423 పరుగులకు ఆలౌటైంది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులు చేసి ఎదురీదుతోంది. వార్నర్ (67 బంతుల్లో 65 బ్యాటింగ్; 10 ఫోర్లు), లియోన్ (26 బంతుల్లో 12 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. పార్నెల్ (2/19), ఫిలాండర్ (2/26) ధాటికి కంగారూ జట్టు 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
అయితే వార్నర్, క్లార్క్ నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ప్రస్తుతం క్లార్క్‌సేన ఇంకా 311 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 214/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డివిలియర్స్, డుమిని నిలకడగా ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరును ఖాయం చేశారు. అయితే లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో ప్రొటీస్ జట్టు 74 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. లియోన్ 5 వికెట్లు తీశాడు.