దక్షిణాఫ్రికాను ఆదుకున్న ఎల్గర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియా చేతిలో తొలిటెస్టులో ఎదురైన ఓటమి భారం నుంచి దక్షిణాఫ్రికా తొందరగానే కోలుకుంది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతీరు ప్రదర్శిస్తోంది.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న స్మిత్‌సేన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. ఎల్గర్ (193 బంతుల్లో 83; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ (126 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్)ల పోరాటంతో కోలుకుంది. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్‌కు టెస్టుల్లో తొలిసారిగా అవకాశమివ్వడంతోపాటు నాలుగు మార్పులతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే కెప్టెన్ స్మిత్ (9)ను హారిస్ అవుట్ చేయగా... తర్వాతి ఓవర్లో ఆమ్లా (0)ను జాన్సన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో ఎల్గర్-డుప్లెసిస్ జోడి కంగారూల బౌలింగ్‌ను సహనంతో ఎదుర్కొంటూ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించాక డుప్లెసిస్‌ను లియాన్ ఔట్ చేశాడు. అనంతరం డివిలియర్స్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన ఎల్గర్‌నూ లియాన్ వెనక్కి పంపడం, డికాక్ (7)ను స్టీవెన్ స్మిత్ ఔట్ చేయడంతో చివర్లో ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించింది. క్రీజులో డివిలియర్స్ (51 బ్యాటింగ్), డుమిని (1 బ్యాటింగ్) ఉన్నారు.