టెస్టు కెప్టెన్సీకి డివిలియర్స్ గుడ్‌బై
ప్రిటోరియా: మోచేతి గాయానికి శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ జట్టు ప్రయోజనాల కోసం కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన గైర్హాజరులో చక్కటి నాయకత్వ పటిమ చూపిస్తున్న డు ప్లెసిస్‌నే కొనసాగిం చాలని అతను దక్షిణాఫ్రికా బోర్డుకు సిఫారసు కూడా చేశాడు. ‘వ్యక్తులకంటే ఎప్పుడైనా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. అది నేనైనా సరే. టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నాకు లభించింది.
అయితే నేను ఇప్పటికే రెండు సిరీస్‌లకు దూరమయ్యాను. త్వరలో శ్రీలంకతో జరిగే సిరీస్‌లో కూడా ఆడటం ఇంకా సందేహంగానే ఉంది. ఆస్ట్రేలియాలో జట్టు అద్భుత ఆటతీరు కనబర్చిన తర్వాత జట్టు కోసం డు ప్లెసిస్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎంపిక చేయడం మంచిది’ అని ఏబీ అన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో సిరీస్ జరుగుతున్న సమయంలో ఆమ్లా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు చేపట్టిన ఏబీ, రెండు టెస్టులకు సారథ్యం వహించాడు.