కేప్‌టౌన్: గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే ఆ దేశ క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా ఇటీవల ఎంపికైన మార్క్ బౌచర్ .. డివిలియర్స్ పునః రాగమనం కోసం తన చర్చలను వేగవంతంగా చేశారు. ఆ క్రమంలోనే జట్టు కెప్టెన్ డుప్లెసిస్‌తో ముందుగా చర్చించగా అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. దాంతో ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ దాదాపు షురూ అయ్యింది. దీనిలో భాగంగా తన సహచర క్రికెటర్ ఏబీతో చర్చలు ఆరంభించినట్లు డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్ టీ20కి ఎంతో సమయం లేనందున డివిలియర్స్ ఎంత తొందరగా జట్టుతో కలిస్తే అంత బాగుంటుందన్నాడు.
ఈ విషయంపై రెండు-మూడు నెలల క్రితమే చర్చించినా బౌచర్ కొత్త కోచ్‌గా వచ్చిన తర్వాత ఏబీ రాకపై కామెంట్ చేయడంతో దానిపై డుప్లెసిస్ స్పందించాడు. ‘ టెస్టు క్రికెట్ అనేది ప్రస్తుతం మాకు చాలా ముఖ్యమైనది. కానీ టీ20 క్రికెట్ అనేది చాలా భిన్నమైనది. ఏబీ రాకతో మా జట్టు మరింత బలోపేతం అవుతుంది. ఏబీ వస్తానంటే సాదరంగా స్వాగతిస్తాం. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంతో సమయం లేదు. అదే సమయంలో మా రోడ్ మ్యాప్ కూడా చాలా బిజిగా ఉంది. ప్రత్యేకంగా ఈ సీజన్ టీ20 షెడ్యూల్ ఎక్కువగా ఉంది. డివిలియర్స్ తొందరగా జట్టులో కలిస్తే అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు’ అని డుప్లెసిస్ తెలిపాడు.ప్రస్తుతం సఫారీ క్రికెట్ సంధి దశలో ఉన్నందున దాన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు కోచ్ బౌచర్, కెప్టెన్ డుప్లెసిస్‌లు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డుప్లిసిస్‌తో పాటు హషీమ్ ఆమ్లా కూడా రిటైర్మెంట్ తీసుకోవడంతో ఆ జట్టు గాడి తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment