మంగళ్ ‘రియో’ ఆశలు సజీవం
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత ఆర్చర్ మంగళ్ సింగ్ చంపియా ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం తొలి రౌండ్‌లో చంపియా 7-3తో రెజెండి జేవియర్ డానియల్ (బ్రెజిల్)పై, రెండో రౌండ్‌లో 7-3తో ముసయెవ్ సంజార్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. అల్వారినో గార్సియా (స్పెయిన్)తో జరిగే మూడో రౌండ్‌లో చంపియా విజయం సాధిస్తే వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. మరోవైపు భారత్‌కే చెందిన జయంత తాలుక్‌దార్, రాహుల్ బెనర్జీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.
జయంత 2-6తో జే లియోన్ (కెనడా) చేతిలో; రాహుల్ బెనర్జీ 0-6తో బోర్డ్‌మన్ (మెక్సికో) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో లక్ష్మీరాణి మాఝీ కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో థామస్ స్లోనీ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్‌లో వలీవా నటాలియా (ఇటలీ)పై లక్ష్మీరాణి ‘టైబ్రేక్’లో విజయం సాధించడం విశేషం. భారత్‌కే చెందిన దీపిక కుమారికి నేరుగా మూడో రౌండ్‌లోకి ‘బై’ లభించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్‌లోకి ‘బై’ లభించింది.