క్రికెటర్ తలకు బలంగా తగిలిన బంతి
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ వోజస్ తలకు బంతి బలంగా తాకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న వోజస్ బంతిని అంచనా వేయడంలో విఫలమై గాయపడ్డాడు. గురువారం తస్మానియా జట్టుతో ఆడుతున్న సమయంలో కామ్ స్టీవెన్సన్ విసిరిన బంతి వోజస్ తలను బలంగా తాకింది. అయితే దీంతో వోజస్ ఫీల్డ్లోనే విలవిల్లాడిపోయాడు.
ఆ తరువాత ఫీల్డర్లు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని వోజస్ ను తరలించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు వోజస్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వోజస్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే తరహాలో వోజస్ గాయపడటం ఈ ఏడాదిలో రెండోసారి.గత మేనెలలో ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడుతూ వోజస్ గాయపడ్డాడు.