వోజెస్ ‘డబుల్ సెంచరీ’
* తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 562 ఆలౌట్
* న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
వెల్లింగ్టన్: ఆడమ్ వోజెస్ (364 బంతుల్లో 239; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో... న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 154.2 ఓవర్లలో 562 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. దీంతో కంగారులకు 379 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆదివారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 62.3 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది.
నికోలస్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. లాథమ్ (63), గప్టిల్ (45) ఫర్వాలేదనిపించినా... విలియమ్సన్ (22), మెకల్లమ్ (10) నిరాశపర్చారు. లయోన్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం కివీస్ ఇంకా 201 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 463/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వోజెస్, సిడెల్ (49) నిలకడగా ఆడారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వోజెస్ 329 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ, బౌల్ట్, బ్రాస్‌వెల్, అండర్సన్, క్రెయిగ్ తలా రెండు వికెట్లు తీశారు.