వోజెస్ 'అద్భుత' డబుల్ సెంచరీ
హోబార్ట్:మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఆడమ్ వోజెస్ అద్భుత డబుల్ సెంచరీ నమోదు చేశాడు. వోజెస్(269 నాటౌట్; 285 బంతుల్లో 33 ఫోర్లు) తనదైన శైలిలో విరుచుకుపడి కెరీర్ లో తొలి ద్విశతకాన్ని సాధించాడు. అతనికి జతగా షాన్ మార్ష్(182; 266 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో ఆసీస్ 583/4 వద్ద డిక్లేర్ చేసింది. 438/3 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ మరోసారి పసలేని విండీస్ బౌలింగ్ ను ఓ ఆటాడుకుంది. దీంతో మరో 145 పరుగులను నమోదు చేసే క్రమంలో ఆసీస్ ఒక వికెట్ ను మాత్రమే నష్టపోయి డిక్లేర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 65.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లలో బ్రాత్ వైట్(2), రాజేంద్ర చంద్రిక(25), మార్లోన్ శామ్యూల్స్(9), బ్లాక్ వుడ్(0), రామ్ దిన్(8), కెప్టెన్ హోల్డర్ (15)లు నిరాశపరచగా, డ్వేన్ బ్రేవో(94 బ్యాటింగ్), రోచ్(31 బ్యాటింగ్)లు ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ మూడు వికెట్లు సాధించగా, హజిల్ వుడ్ రెండు, సిడెల్ ఒక వికెట్ తీశారు.
మ్యాచ్ విశేషాలు..
250కు పైగా వ్యక్తిగత పరుగులు చేసే క్రమంలో వోజెస్ ది నాల్గో అత్యుత్తమ స్ట్రైక్ రేట్(94.38). అంతకుముందు మూడు అత్యుత్తమ స్ట్రైక్ రేట్ లు భారత్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిటే ఉండటం విశేషం.
షాన్ మార్ష్-వోజెస్ లు నాల్గో వికెట్ కు 449 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇదే ఓవరాల్ గా నాల్గో వికెట్ కు అత్యుత్తమం
449 .. ఆసీస్ గడ్డపై ఏ వికెట్ కైనా నమోదైన భాగస్వామ్యాల్లో మార్ష్-వోజెస్ ల తాజా భాగస్వామ్యమే అత్యుత్తమం. అంతకుముందు ఈ రికార్డు డాన్ బ్రాడ్ మన్-సిడ్ బార్న్స్ జోడి పేరిట ఉండేది. 1946-47లో యాషెస్ సిరీస్ లో బ్రాడ్ మన్, బార్న్స్ ల జోడి 405 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
449.. వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం