ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అఫ్ఘానిస్తాన్ జట్టు వన్డే క్రికెట్‌లో సంచలనం నమోదు చేసింది. ఐసీసీ సభ్య దేశం జింబాబ్వేపై
జింబాబ్వేపై 3-2తో వన్డే సిరీస్ కైవసం
బులవాయో: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అఫ్ఘానిస్తాన్ జట్టు వన్డే క్రికెట్‌లో సంచలనం నమోదు చేసింది. ఐసీసీ సభ్య దేశం జింబాబ్వేపై వన్డే సిరీస్ నెగ్గి కొత్త చరిత్రను సృష్టించింది. అసోసియేట్ దేశమైన అఫ్ఘాన్ శనివారం జరిగిన ఆఖరి వన్డేలో 73 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది.
నూర్ అలీ జద్రాన్ (54), మహ్మద్ నబీ (53), అస్గర్ (38) రాణించారు. మసకద్జా, రజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత జింబాబ్వే 44.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (124 బంతుల్లో 102; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. దౌలత్ జద్రాన్ 4, అమిర్ హమ్జా 3 వికెట్లు పడగొట్టారు. నబీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించగా, విలియమ్స్, దౌలత్‌లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును పంచుకున్నారు. ఓ అసోసియేట్ దేశం ఐసీసీ సభ్యదేశంపై వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.