
ముంబై: ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ జట్టుకు పాల్గొనే అర్హత లేకపోవడం బాధ, ఒకింత చిరాకు పరుస్తోందని కరీబియన్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ చెప్పారు. తాజా మెగా టోర్నీలో వన్డే ప్రపంచకప్ మాజీ చాంపియన్లు విండీస్, శ్రీలంక జట్లు అర్హత సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ... క్రికెట్‌లో రోజురోజుకు పరిణతి సాధిస్తూ... ప్రదర్శన మెరుగుపర్చుకుంటున్న అఫ్గానిస్తాన్ జట్టును చూసి తమ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలని హితవు పలికారు.
‘మైదానంలో దిగినపుడు అఫ్గాన్ ఆటగాళ్లలో కసి కనిపిస్తుంది. వారి పోరాటం ముచ్చటేస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి ఏన్నో ఏళ్ళు కాలేదు. అయినాసరే... దశాబ్దాలుగా ఆడుతున్న మిగతా జట్ల కంటే ఎంతో మెరుగ్గా అఫ్గాన్ ఆడుతోంది. ఏటికేడు ప్రగతి సాధిస్తున్న వారి ఆటతీరు అద్భుతం. ఈ చాంపియన్స్ ట్రోఫీనే చూసుకుంటే మా వెస్టిండీస్ జట్టు టాప్–8లో లేక టోరీ్నకి దూరమైంది. మరోవైపు నిలకడగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ మేటి జట్లతో తలపడుతోంది’ అని అన్నారు.
ఇలాంటి జట్టును, ప్రతిభను చూసి వెస్టిండీస్ మారాలన్నారు. క్రికెటర్లు మాత్రమే కాదు... బోర్డు, దేశవాళీ పరిస్థితులు అన్నింటా మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడంపై రిచర్డ్స్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంగ్లండ్ మాజీలు నాసిర్ హుస్సేన్, మైక్ అథర్టన్ ఒక్క దుబాయ్ వేదికపై భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడటం, వచ్చే అనుకూలతలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.