
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్రిది అల్విదా...
షార్జా: ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అభిమానులచే ముద్దుగా ‘బూమ్.. బూమ్’ అని పిలిపించుకునే 36 ఏళ్ల ఆఫ్రిది 1996లో అరంగేట్రం చేశాడు. దీంతో 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ముగింపునకు ఇదే సరైన సమయంగా భావించాడు. అయితే 2010లోనే అతను టెస్టుల నుంచి తప్పుకోగా... 2015 ప్రపంచకప్ అనంతరం వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పి కేవలం టి20లకే పరిమితమయ్యాడు. 2016లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లోనే జట్టు వెనుదిరగడంతో కెప్టెన్సీకి రాజీనామా చేసి ఆటగాడిగా కొనసాగేందుకు ఇష్టపడ్డాడు.
అయితే సెలక్టర్లు మాత్రం అతడి పేరును పరిశీలనకు తీసుకోలేదు. దీంతో తప్పుకోవడమే మేలని ఆఫ్రిది భావించాడు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడుతున్నాడు. ‘నేను నా అభిమానుల కోసం ఆడుతున్నాను. మరో రెండేళ్ల పాటు పీఎస్‌ఎల్‌లో ఆడతాను. కానీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నాను. అంకితభావంతో పూర్తి ప్రొఫెషనల్‌గా ఇంతకాలం దేశానికి ఆడాను’ అని ఆఫ్రిది తెలిపాడు.