
కేప్‌టౌన్:మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకోగా, భారత జట్టు తేలిపోయింది. ప్రధానంగా దక్షిణాఫ్రికా పేస్ విభాగం దెబ్బకు చతికిల బడిన భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
అయితే భారత తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తనదైన మార్కును చూపెట్టాడు. ప్రధానంగా మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో మెరిసిన పాండ్యా.. సఫారీలను ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు. కాగా, 93 వ్యక్తిగత పరుగుల వద్ద పాండ్యా నిష్క్రమించడంతో దక్షిణాఫ్రికా ఊపిరిపీల్చుకుంది. కాగిసో రబడా బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్ ఇచ్చిన పాండ్యా తొమ్మిదో వికెట్‌గా అవుటయ్యాడు.
ఈ అవుట్‌తో ఆనందంలో మునిగిపోయిన సఫారీ కెప్టెన్ డు ప్లెసిస్..రబడా నుదుటిపై ముద్దుపెడుతూ శభాష్ అంటూ అభినందించాడు. మరొకవైపు రబడాను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన డు ప్లెసిస్..ఇదే నిన్ను ప‍్రపంచ నంబర్ బౌలర్‌ను చేసిందంటూ కొనియాడాడు. దీనిపై స్పందించిన రబడా.. 'నువ్వు పెట్టిన ముద్దుపై నా గర్ల్‌ఫ్రెండ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.. ఇప్పుడు నేను ఏమి చెప్పుకోవాలి' అని బదులిచ్చాడు.