
ఢిల్లీ: ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ షాట్స్ అంటే.. దిల్‌స్కూప్.. స్విచ్ షాట్స్.. ర్యాంప్ షాట్.. వాక్‌వే కట్.. పెరిస్కోప్ షాట్.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధోనీ హెలికాప్టర్ షాట్.. అని టకటకా చెప్పేయొచ్చు. కానీ గురువారంనాటి మ్యాచ్‌లో రిషభ్ పంత్ కొట్టినషాట్లకు మాత్రం కొత్త పేర్లు వెతుకుతున్నారు క్రీడాపండితులు!! ఐపీఎల్ 2018లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ రిషభ్.. బ్రహ్మాండం బద్దలయ్యే రేంజ్‌లో(63 బంతుల్లో 7 సిక్సర్లు, 15 ఫోర్లు 128 పరుగులు) ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మామూలుగానే అగ్రెసివ్ ఆటను ప్రదర్శించే పంత్.. నిన్న ఘోరతప్పితాలు చేసినందుకే ద్విగుణీకృత బాధ్యతతో ఆడానని చెప్పుకొచ్చాడు.
అప్పుడే నిర్ణయించుకున్నా: ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి అర్ధభాగంలో.. అసలే మందకోడిగా సాగుతున్నవేళ అయ్యర్, హర్షల్ పలేట్‌లు అనూహ్యరీతిలో రనౌట్ అయ్యారు. ఆ ఇద్దరినీ మింగింది పంతే! మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నాడు. ‘‘నేను తప్పు చేశాను. పరుగు తీయాలా వద్దా అని సరిగా అంచనా వేయలేకపోయాను. దీంతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయా. అఫ్‌కోర్స్ ఇది క్రికెట్‌లో సహజమే. అయితే, ఆ రెండు రనౌట్ల తర్వాత నేను మరింత బాధ్యతగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అని ఇప్పుడే చెప్పలేనుగానీ, వన్ ఆఫ్ ది బెస్ట్‌గా మాత్రం నిలుస్తుంది..’’ అని వ్యాఖ్యానించాడు. మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు–2009లో) తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా పంత్ (20 ఏళ్ల 218 రోజులు) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఒంటిచేత్తో సిక్సర్: ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతోన్న భువీకి పంత్ చుక్కలు చూపించాడు. చివరి ఓవర్‌లో ఐదు బంతులు ఆడిన రిషబ్ ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. 4,4,6,6,6 గణాంకాలు నమోదయ్యాయి. వీటిలో నాలుగో బంతిని ఒంటిచేత్తో సిక్సర్‌గా మలిచిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. (ఆ వీడియోను కింద చూడొచ్చు)
మ్యాచ్ రిపోర్ట్: గురువారం ఫిరోజ్‌షా కోట్లాలో జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. వరుసగా ఆరో విజయంతో ఈ సీజన్‌లో తొమ్మిదో గెలుపుతో హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (63 బంతుల్లో 128 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత హైదరాబాద్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (50 బంతుల్లో 92 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment