కోహ్లీతో పోల్చుకుని భంగపడ్డ పాక్ క్రికెటర్
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తనను భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుకుని భంగపడ్డాడు. తాను విరాట్‌లా ఉంటానని, పరుగులు చేయడంలో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని తరచూ చెబుతుంటాడు. ఇటీవల షెహజాద్ తనను కోహ్లీతో పోల్చుకోవడంపై నెటిజన్లు గట్టిగా చురకలు అంటించారు. విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్‌లకు వారి జట్టు సభ్యులు, అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందని, అయితే ఈ విషయంలో తాను దురదృష్టవంతుడినని షెహజాద్ చెప్పినట్టుగా పాక్‌కు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు ఇటీవల ట్వీట్ చేశాడు.
దీన్ని చూడగానే క్రికెట్ అభిమానులు ట్వీట్లతో షెహజాద్‌ను ఉతికిఆరేశారు. కోహ్లీ, రూట్, విలియమ్సన్‌లతో షెహజాద్ పోల్చుకోవడం సిగ్గుచేటని, వాళ్లతో పోల్చుకునే అర్హత లేదని ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు. షెహజాద్ వ్యాఖ్యలను తప్పుపడుతూ పాక్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. కోహ్లీ అన్ని ఫార్మాట్లతో దుమ్ములేపుతూ పరుగుల వర్షం కురిపిస్తుండగా, షెహజాద్ ఏమో జట్టులో చోటు దొరకగా నానా పాట్లు పడుతున్నాడు. టి-20 ప్రపంచ కప్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీంతో కోహ్లీ ఆటతీరుతో షెహజాద్ తనను పోల్చుకోవడం అభిమానులకు నచ్చలేదు.