► నేడు చిరకాల ప్రత్యర్థుల పోరు
► అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీ
ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్ నేడు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కీలక సమరానికి సిద్ధమవుతోంది. గతేడాది కాంస్యంతో సరిపెట్టుకున్న సర్దార్ సింగ్ సేన ఈసారి మెరుగైన ఫలితం సాధించాలనే కసితో ఉంది. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన జట్టు పాక్‌తో మాత్రం పూర్తి స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో జపాన్‌పై నెగ్గినా రెండో మ్యాచ్‌లో ఆసీస్‌తో దారుణంగా ఓడింది. అలాగే ఆదివారం కెనడాపై నెగ్గేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు 3-1తో గట్టెక్కింది. అయితే పాక్‌తో మ్యాచ్ అంటే భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి కాబట్టి ఏమాత్రం అలక్ష్యం లేకుండా ఆడాల్సి ఉంటుంది.
రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిన జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అటు పాక్ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే సాధించింది. అయినా భారత్‌తో మ్యాచ్ అనగానే సమీకరణాలు మారిపోతాయి. విజయమే లక్ష్యంగా ఆ జట్టు పోరాడుతుంది. భారత జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్, తల్విందర్, తిమ్మయ్య ఫామ్‌లో ఉన్నారు. మిడ్‌ఫీల్డ్‌లో సర్దార్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవలి దక్షిణాసియా క్రీడల ఫైనల్లో భారత్‌ను ఓడించి స్వర్ణం సాధించిన పాక్ జట్టులోని ఎనిమిది మంది యువ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఆ ఈవెంట్‌లో భారత్ పూర్తి స్థాయి జట్టును ఆడించలేదు.
భారత్vsపాక్
Published Tue, Apr 12 2016 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM
Advertisement
Advertisement