సచిన్ రికార్డును మళ్లీ మిస్సయ్యాడు!
చెస్టర్ లీ స్ట్రీట్: మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో నెలకొల్పిన పదివేల పరుగుల రికార్డును ఈజీగా బద్దలు కొడతానన్న ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ కు నిరీక్షణ తప్పడం లేదు. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభం అయ్యేనాటికి పదివేల పరుగుల రికార్డును అందుకోవడానికి 36 పరుగుల దూరంలో ఉన్న కుక్ .. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 15 పరగులు చేసి నిరాశపరిచాడు. దీంతో పదివేల పరుగులను పూర్తి చేయడానికి కుక్ ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కుక్ 16 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం సాధించడంతో కుక్ కు రెండో ఇన్నింగ్స్ లో ఆడే అవకాశం రాలేదు. అయితే రెండో టెస్టు తొలి రోజే సచిన్ రికార్డును కుక్ అధిగమిస్తాడని అంతా భావించినా అది సాధ్యం కాలేదు. మరి సచిన్ రికార్డను తదుపరి ఇన్నింగ్స్ లో కుక్ అధిగమిస్తాడా?లేదా అనేది చూడాల్సిందే.
సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు. ఇప్పటివరకూ 11 మంది ఆటగాళ్లు మాత్రమే పది వేల మార్కును చేరితే, ఇంగ్లండ్ తరపున ఒక్క ఆటగాడు కూడా ఆ మార్కును చేరలేదు. దీంతో కుక్ ఒకేసారి రెండు అరుదైన రికార్డులను నమోదు చేయడానికి కొద్ది దూరంలో నిలిచాడు.