తరం మారింది..!
♦ కొత్త కొత్తగా భారత టెస్టు జట్టు
♦ దాదాపు అందరికీ ఐదేళ్లకంటే తక్కువ అనుభవం
దాదాపు రెండేళ్ల క్రితం సచిన్ రిటైర్ అయ్యేంత వరకు భారత టెస్టు జట్టంటే అందరి మనసుల్లో ఒక లైనప్ ముద్రించుకుపోయింది. సెహ్వాగ్, గంభీర్ ఓపెనర్లుగా ఆ తర్వాత ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్...ఇలా చాలా వరకు ఈ జట్టు మార్పులు లేకుండా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఒక దశలో దేశవాళీలో అద్భుతాలు చేసినా, ఈ స్టార్ల కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన బ్యాట్స్‌మన్ ఎందరో ఉన్నారు.
దిగ్గజాలు రిటైర్ అయినా ధోని టెస్టులు ఆడినంత వరకు జట్టులో సీనియర్లు లేని లోటు కనిపించలేదు. అప్పుడప్పుడు సెహ్వాగ్, గంభీర్, జహీర్, హర్భజన్ ఇలా ఎవరో ఒకరు టెస్టు తుది జట్టులో ఆడుతూ రావడంతో మరీ జూనియర్ల జట్టుగా కూడా అనిపించలేదు.
కానీ ఇప్పుడు తరం మారింది. శ్రీలంకతో ఆడుతున్న టెస్టు జట్టును చూస్తే ఇద్దరు మినహా ఎవరికీ కనీసం ఐదేళ్ల అనుభవం కూడా లేదు. చివరకు జట్టును నడిపిస్తున్న కోహ్లికి కూడా. అయినా సరే ఈ జట్టు ఆత్మవిశ్వాసంతో నిలబడింది. రెండో టెస్టు విజయం తర్వాత మరింత నమ్మకం పెంచింది. ఒకరు గాయంతో దూర మైనా... నేనున్నానంటూ ఆ బాధ్యతను తీసుకునేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండటం మంచి పరిణామం.
సాక్షి క్రీడా విభాగం : గత ఐదేళ్ల కాలంలో భారత జట్టు తరఫున 20 మంది ఆటగాళ్లు టెస్టుల్లోకి అడుగు పెట్టారు. వీరిలో పది మంది ఇప్పుడు శ్రీలంకలో పర్యటిస్తున్న టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ టూర్‌లో లేకపోయినా...షమీ, కరణ్, జడేజాలాంటి ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి రాగల సత్తా ఉన్నవారే. ప్రస్తుత సిరీస్‌లో చూస్తే హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలకు మాత్రమే ఐదేళ్ల అనుభవం ఉంది. మురళీ విజయ్ 2008లోనే తొలి టెస్టు ఆడినా 2010 తర్వాత అతను రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భజ్జీ కెరీర్ చరమాంకంలో ఉండగా, ఇషాంత్ బౌలింగ్‌లో పదును లోపించింది. కాబట్టి భారత జట్టు భారమంతా కొత్త ఆటగాళ్లపైనే నిలిచిందనడంలో సందేహం లేదు.
కోహ్లి అండగా...
‘రాబోయే కొన్నేళ్ల పాటు ఈ జట్టులో చాలా మంది భారత్‌కు దశ, దిశ నేర్పించగలరు. అందుకే కఠిన పరిస్థితుల్లోనూ రాణించడం నేర్చుకోవాలి’ అంటూ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటననుంచి తరచుగా చెబుతూ వస్తున్నాడు. సహచరులలో పదే పదే ఇదే మాటతో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు. టెస్టు క్రికెటర్‌గా నాలుగేళ్ల అనుభవం మాత్రమే ఉన్న కోహ్లి, ఇప్పుడు తాను ఆడుతూ జట్టును నడిపించాల్సిన బాధ్యతను మోస్తున్నాడు. కోహ్లి ఇప్పటి వరకు 36 టెస్టులే ఆడాడు.
బ్యాటింగ్ బృందంలో కోహ్లికంటే కాస్త ఎక్కువ అనుభవం ఉన్న పుజారా కూడా జట్టులోకి వచ్చి ఐదేళ్లు కాలేదు. ఈ సిరీస్‌కు ముందు ఓపెనర్లుగా ధావన్, విజయ్‌లే కనిపించారు. కానీ మూడో టెస్టు వచ్చేసరికి కాంబినేషన్ పూర్తిగా మారిపోతోంది. గాయాలతో ఎవరూ దూరమైనా ఆ స్థాయిలో ఆడేందుకు తర్వాతి బృందం సిద్ధంగా ఉంది. కొత్తవాడే అయినా లోకేశ్ రాహుల్ బ్యాటింగ్‌లో ఎంతో పరిణతి చూపించాడు.
మూడేళ్ల క్రితం అయితే అతను ఇంత తొందరగా జట్టులోకి వచ్చి తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కకపోయేదేమో! ధావన్ అయితే రెండేళ్లకే స్టార్‌గా మారిపోయాడు. వీరూ, గౌతీలాంటి వాళ్లను మరచిపోయే ప్రదర్శన చేశాడు. భారత బృందంలో స్టార్ల కారణంగా రంజీలు ఆడిన ఆరేళ్ల తర్వాత గానీ చోటు దక్కించుకోలేకపోయిన రహానే ఇప్పుడు ఎలా చెలరేగుతున్నాడో చూస్తున్నాం. ఇక కేవలం రెండేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కే కరుణ్ నాయర్‌కు టీమిండియా పిలుపు రావడం కొత్త మార్పుకు సూచన.
బౌలింగ్ నాయకుడిగా అశ్విన్
ఆటగాడిగా అశ్విన్ కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లు కూడా కాలేదు. కానీ అతనే ఇప్పుడు ‘బౌలింగ్ లీడర్’. పక్కలో బల్లెంలా మరో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ జట్టులో ఉన్నా... అనుభవంకంటే పదునైన ఆటకే విలువ అనేది రెండో టెస్టులో అతను మరోసారి నిరూపించాడు. పేరుకు 64 టెస్టుల అనుభవంతో ఇషాంత్ సీనియర్‌గా ఉన్నా... ఇప్పుడు భారత పేస్ బండిని ఉమేశ్ యాదవ్ నడిపిస్తున్నాడనేది వాస్తవం. ఒకానొక సమయంలో ధోని ఉండగా చోటు రాదని భావించి భారత దేశవాళీ క్రికెట్‌లో కీపింగ్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లు కూడా ఉన్నారు! కానీ అతని ప్రత్యామ్నాయంగా స్థానం దక్కించుకున్న సాహా రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌లో రాణించాడు.
నమ్మకం నిలబెట్టాలి
అనుభవం తక్కువగా ఉన్నా... స్టార్ల చాటున సహాయక పాత్రలో కాకుండా జట్టులో దాదాపు అందరికీ తమను తాము నిరూపించుకునే అవకాశం లభిస్తోంది. కొత్త తరానికి సంబంధించి ఇదే చెప్పుకోదగ్గ విషయం. ప్రతీ ఒక్కరు ఇప్పుడు తానే సీనియర్‌గా భావించి బాధ్యతను అందుకుంటున్నారు. ఈ అవకాశాన్ని వారంతా చక్కగా వాడుకున్నారు కూడా. అయితే మనతో పోలిస్తే శ్రీలంక జట్టు ఇంకా కుర్రాళ్లతో నిండి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అంతా అద్భుతం అని చెప్పలేం. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ వీరి సామర్థ్యానికి పరీక్ష.