Indian Test team
-
నేడు విహారి నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిరకాల స్నేహితురాలు యెరువ ప్రీతిరాజ్‌తో విహారి వివాహ నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లో జరుగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త యెరువ రాజానందరెడ్డి కుమార్తె అయిన ప్రీతిరాజ్ స్వీడన్లో మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్టు జట్టు తరఫున అరంగేట్రం చేసిన 25 ఏళ్ల విహారి గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు భారత క్రికెటర్లతో పాటు హైదరాబాద్, ఆంధ్ర రంజీ జట్ల ఆటగాళ్లు హాజరయ్యే అవకాశముంది. -
రాజ్‌కోట్‌కు చేరిన భారత జట్టు
-
రాజ్‌కోట్‌కు చేరిన భారత జట్టు
రాజ్‌కోట్: విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు శనివారం ఉదయం రాజ్‌కోట్‌కు చేరుకుంది. స్థానిక ఆటగాళ్లు పుజారా, జడేజా జట్టుతో పాటు కలిశారని.. హార్ధిక్ పాండ్యా రోడ్డు మార్గం ద్వారా రాజ్‌కోట్‌కు వచ్చినట్టు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మీడియా మేనేజర్ హిమాన్షు షా వెల్లడించారు. శనివారమే 28వ పడిలోకి అడుగుపెట్టిన కోహ్లి... జట్టు ఆటగాళ్లు, ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి హోటల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నాడు. అటు కోహ్లి పుట్టిన రోజు సందర్భంగా సచిన్, సెహ్వాగ్, యూసుఫ్ పఠాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజ్‌కోట్ ఎరుుర్‌పోర్ట్‌లో అభిమానులు పెద్ద సంఖ్యలో కేకులు, బొకేలతో కోహ్లికి స్వాగతం పలకగా తను అనుష్కతో కలిసి నేరుగా హోటల్‌కు వెళ్లిపోయాడు. -
అలా కలిసొస్తోంది!
16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు... 22 వికెట్లు... 33 సగటు... ఈ గణాంకాలతో భారత టెస్టు జట్టులోకి బౌలింగ్ ఆధారంగా ఓ ఆటగాడు ఎంపికవుతాడనేది ఊహించని అంశం. కానీ హార్ధిక్ పాండ్యా ఇవే అంకెలతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు... ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ద్వారా దాదాపుగా అరంగేట్రం చేయడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. 23 ఏళ్ల ఈ బరోడా ఆల్‌రౌండర్ ఇప్పటివరకు నాలుగు వన్డేలు, 16 అంతర్జాతీయ టి20లు ఆడాడు. ఈ ఏడాది జనవరి 26న ఆస్ట్రేలియాలో టి20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. టి20 ప్రపంచకప్ వరకూ భారత జట్టులో కొనసాగాడు. అరుుతే ఐపీఎల్లో పేలవ ఫామ్ వల్ల జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాలేదు. కానీ ఆస్ట్రేలియా ‘ఎ’ పర్యటనకు ఎంపిక కావడం తన కెరీర్‌ను మార్చేసింది. ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర తను చాలా మెరుగయ్యాడు. అదే పర్యటనకు అప్పటి సెలక్టర్, ప్రస్తుత సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా వెళ్లారు. పాండ్యా ప్రోగ్రెస్‌ను ఆయన దగ్గరి నుంచి గమనించారు. ఇవన్నీ తనకి కలిసొచ్చారుు. వచ్చే ఏడాది చాంపియన్స ట్రోఫీ ఇంగ్లండ్‌లో జరుగుతున్నందున ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను వెతకాలనే ఆలోచనతో పాండ్యాను వన్డే జట్టులోకి తెచ్చారు. కపిల్ దేవ్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న పాండ్యా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్ చేసి సెలక్టర్ల అంచనాలను నిలబెట్టాడు. ధోనిని కూడా ఆకట్టుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలించిన విశాఖలో తను బెంచ్‌కు పరిమితమయ్యాడు. కారణం... తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు. ఇద్దరు స్పిన్నర్లు సరిపోతారనుకునే పిచ్ మీద మూడో పేసర్‌గా, ఆల్‌రౌండర్ స్లాట్‌లో ఆడించడానికే తనని తీసుకున్నారని అందరికీ స్పష్టత వచ్చింది. అరుుతే టెస్టు జట్టులోకి ఇంత తొందరగా వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. కేవలం పది నెలల వ్యవధిలో మూడు ఫార్మాట్లలోకీ ప్రస్తుతం ఉన్న పోటీలో రావడం నిజంగా గొప్ప విషయమే. నిజానికి ఇంగ్లండ్ స్పిన్ బలహీనత వల్లే పాండ్యా జట్టులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన సమయమంలో కొత్త బంతిపై పేస్‌ను తీయడానికి రెండో పేసర్‌గా తను పనికొస్తాడు. ఇక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే కొంతవరకు తనని తాను నిరూపించుకున్నాడు. ముగ్గురిలో ఉత్తమం నిజానికి భారత్‌కు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరత చాలా కాలంగా ఉంది. స్టువర్ట్ బిన్నీ ఇంతకాలం అడపాదడపా ఆ పాత్ర పోషిస్తూ వచ్చాడు. అరుుతే తనకు ఎన్ని అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేదు. బ్యాట్స్‌మన్‌గా కొంత ఫర్వాలేదనిపించినా బౌలర్‌గా తను అంతంత మాత్రమే. ఇక రిషి ధావన్ బౌలర్‌గా ఉత్తమం. కానీ బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేదు. నిజానికి రిషి రంజీట్రోఫీలో కూడా నిలకడగా ఆడుతున్నాడు. న్యాయంగా అరుుతే పాండ్యా కంటే ముందు తను జట్టులోకి రావాలి. బ్యాటింగ్‌లో పాండ్యా మిగిలిన ఇద్దరి కంటే ఉత్తమం. కివీస్‌తో వన్డే సిరీస్ ద్వారా బౌలర్‌గా కూడా ఎదుగుదల చూపించడంతో మరో ఆలోచన లేకుండా జట్టులోకి వచ్చాడు. ఏదేమైనా ఇది తనకు సవర్ణావకాశం. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో లభించే ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తన కలలను సాకారం చేసుకోగలుగుతాడు. ప్రస్తుతం ఒక రకంగా హార్ధిక్ పాండ్యా సీజన్ నడుస్తోంది. తనకు అంతా కలిసొస్తోంది. ఇక భవిష్యత్ ఏంటనేది పూర్తిగా అతని చేతుల్లోనే ఉంది. -
నా ఎంపిక షాక్ కు గురిచేసింది!
టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ భారత జట్టు తరఫున టెస్టు ఆడి రెండేళ్లు దాటిపోయింది. అయినా సరే మరోసారి అతడిపై పూర్తి నమ్మకంతో జట్టులోకి ఆహ్వానించారు. దేశవాళీ లీగ్ క్రికెట్లో ఈ సీనియర్ ప్లేయర్ ఫామ్‌ను చూసి జట్టులోకి ఆహ్వానించారా.. లేక అతడికి వీడ్కోలు మ్యాచ్ లకు ముందే సిద్ధం చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తకమానదు. ఏది ఏమైతేనేం.. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా గాయపడిన లోకేశ్ రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ చోటు దక్కించుకున్న ఎందరో వెటరన్ ఆటగాళ్ల తరహాలోనే తన ఎంపికపై గంభీర్ హర్షం వ్యక్తంచేశాడు. తొలి టెస్టు ఆడే కుర్రాడు ఎలా ఉంటాడో.. ఆ బ్యాట్స్ మన్ ఏ విధంగా ఫీలవుతాడో.. తాను కూడా ప్రస్తుతం అలాంటి స్థితిలో ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన ఎంపికపై షాక్ తో పాటు ఎంతో ఒత్తిడికి గురైన అనుభూతిని పొందినట్లు గౌతీ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఎన్నో ఆశలతో మళ్లీ జట్టులోకి వస్తున్నాను. దేశం తరఫున ఆడటంతో ఏ వ్యక్తిని ఎవరూ అడ్డుకోలేరు. టెస్ట్ క్రికెట్, రెడ్ బాల్, భారత్ క్యాప్ మళ్లీ తాను ధరించబోతున్నందుకు బీసీసీఐకి, తనకు అండగా నిలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. శుక్రవారం నుంచి రెండో టెస్టు జరిగే కోల్‌కతాలో గంభీర్ జట్టుతో పాటు చేరతాడన్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో కివీస్ పై భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. Excitement of a debutant, certainty of experienced, nervousness of a novice...am feeling it all. Eden here I come loaded with ambitions. — Gautam Gambhir (@GautamGambhir) 27 September 2016 Nothing beats playing again for d country. Test cricket, whites, red ball and India cap again. Thanks @BCCI, thanks 2 all for d prayers. — Gautam Gambhir (@GautamGambhir) 27 September 2016 -
పాతవాళ్లను పిలుస్తున్నారు
గౌతమ్ గంభీర్ భారత జట్టు తరఫున టెస్టు ఆడి రెండేళ్లు దాటింది...మరి కొద్ది రోజుల్లో అతను 36వ ఏట అడుగు పెడుతున్నాడు. కొత్త సారథి నేతృత్వంలో కొత్తగా కనిపిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న జట్టులోకి ఈ వెటరన్‌ను తిరిగి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో ఒక సీనియర్ ఫామ్‌ను చూసి గౌరవించారా లేక ప్రతిభ గల కుర్రాళ్లెవరూ అందుబాటులో లేక మళ్లీ వెనక్కి వెళుతున్నారా! వన్డేల్లో యువరాజ్ సింగ్ బరిలోకి దిగి మూడు సంవత్సరాలు కావస్తోంది. అతనికీ ఈ ఏడాది చివరికి 35 ఏళ్లు పూర్తవుతాయిచాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయిఆహా అనిపించే ప్రదర్శన ఏదీ ఇటీవల అతడి నుంచి రాలేదు. కానీ వన్డేల్లో అతని పునరాగమనం కూడా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు దూసుకొచ్చి తమ స్థానం పదిలం చేసుకున్న సమయంలో యువీని పిలవాలనుకోవడం ఆశ్చర్యకరం! దిగ్గజ క్రికెటర్లు రిటైరైన తర్వాత కూడా భారత టెస్టు జట్టు ఊహించనంత వేగంగా నిలదొక్కుకొని పటిష్టంగా మారింది. అటు వన్డేల్లో కూడా అవకాశం దక్కినవారిలో చాలా మంది తమను తాము నిరూపించుకొని రెగ్యులర్ స్థానానికి అర్హత సాధించారు. ఇలాంటి స్థితిలో మళ్లీ సీనియర్లను తెచ్చి ప్రయోగం చేయడం సత్ఫలితాలనిస్తుందా... జట్టుపై దీని ప్రభావం ఉండదా! సాక్షి క్రీడా విభాగం : టెస్టులో గాయపడిన లోకేశ్ రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శుక్రవారం నుంచి రెండో టెస్టు జరిగే కోల్‌కతాలో అతను జట్టుతో పాటు చేరతాడు. ఢిల్లీ రంజీ జట్టు సన్నాహక శిబిరంలో ఉన్న గంభీర్ హడావిడిగా మంగళవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్లి ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉన్నా... ముందు జాగ్రత్తగా గంభీర్‌ను పిలిచారు. మరో వైపు యువరాజ్ కూడా మంగళవారం జరిగిన ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. వన్డేల్లో అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇటీవల దులీప్ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరిని స్వయంగా కలిసిన కుంబ్లే... రానున్న సుదీర్ఘ సీజన్ కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. దులీప్ ట్రోఫీలో రాణించి... ‘నిరాశ చెందాను కానీ ఓడిపోలేదు. పక్కకు తోసేశారు కానీ భయపడటం లేదు. అయితే నేను పోరాడటం ఆపను‘... ఇటీవల టెస్టు జట్టులో స్థానం లభించనప్పుడు గంభీర్ చేసిన ట్వీట్ ఇది. చాలా మంది సీనియర్లతో పోలిస్తే ఓటమిని అంగీకరించకుండా అతను తన పునరాగమనం కోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. దులీప్ ట్రోఫీలో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సహా ఐదు ఇన్నింగ్సలలో కలిపి అతను 356 పరుగులు చేశాడు. గత ఏడాది రంజీ ట్రోఫీలో అతను గొప్పగా రాణించలేదు. ఒక్క సెంచరీ కూడా లేకుండా 14 ఇన్నింగ్సలలో 38 సగటుతో 488 పరుగులు మాత్రమే చేశాడు. అరుుతే తన స్వార్థం కోసం కాకుండా జట్టు గెలుపు లక్ష్యంగా ఆడానని, తక్కువ పరుగులే అరుునా అవి వచ్చిన కీలక సందర్భాలను బట్టి తనను అంచనా వేయాలని గంభీర్ చెప్పుకున్నాడు. నిజానికి టెస్టు జట్టుకు దూరమైన తర్వాత రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి అనూహ్యంగా పిలుపు దక్కింది. అయిగు ఇన్నింగ్సలో కలిపి 25 పరుగులే చేయడంతో మళ్లీ చోటు కోల్పోయాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో గంభీర్ 34 ఇన్నింగ్సలలో దాదాపు 49 సగటుతో 1580 పరుగులు చేసి రెండో స్థానంలో నిలవడం విశేషం. అరుుతే సత్తా చాటి జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్లకూ కొదవ లేదు. గత ఏడాది రంజీలో అత్యధిక పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్ (1321 పరుగులు- 21 ఏళ్లు) కూడా టాపార్డర్ బ్యాట్స్‌మన్. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అఖిల్ హేర్వాడ్కర్ (879- 21 ఏళ్లు) ముంబై తరఫున ఓపెనర్‌గానే ఆడతాడు. ఇంతకు ముందు భారత్‌కు ఆడి విఫలమైన 26 ఏళ్ల ఓపెనర్ ముకుంద్ గత రెండేళ్లలో భారత దేశవాళీలో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటే గంభీర్కంటే నిలకడగా ఆడాడు. యువరాజ్లో సత్తా ఉందా..? గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో రాణించడంతో యువరాజ్‌సింగ్‌కు అనూహ్యంగా భారత టి20 జట్టులోకి పిలుపు లభించింది. ఆసీస్ టూర్ మొదలు వరల్డ్ కప్ వరకు టీమ్‌లో ఉన్న అతను సెమీస్ మ్యాచ్‌కు ముందు గాయంతో తప్పుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో టి20ల్లో అతను అద్భుతాలేమీ చేయలేదు. 11 ఇన్నింగ్సలలో కేవలం 104 స్టైక్ర్రేట్తో 166 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు! ఐపీఎల్లో ఆకట్టుకోని అతను, దులీప్ ట్రోఫీలో నాలుగు ఇన్నింగ్సలోనూ విఫలమయ్యాడు. వన్డే టీమ్‌లోకి మళ్లీ అతనికి అవకాశం కల్పించే ప్రదర్శన ఏదీ అతనినుంచి రాలేదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాతి నుంచి మూడేళ్ల క్రితం వన్డే టీమ్‌లో స్థానం కోల్పోయే వరకు 19 మ్యాచ్‌లలో యువీ చేసింది 2 అర్ధ సెంచరీలే. ఇలాంటి స్థితిలో అతడిని మళ్లీ తీసుకురావడం అంటే యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయడమే. ఆసీస్‌తో ఆడిన మ్యాచ్‌లో మనీశ్ పాండే అద్భుత సెంచరీతో అలరించాడు. జింబాబ్వే సిరీస్‌లో ఆకట్టుకున్న కరుణ్ నాయర్, మన్దీప్ సింగ్‌లాంటి కుర్రాళ్లు తాము వన్డేల కోసం సిద్ధంగా ఉన్నట్లు నిరూపించారు. సుదీర్ఘ కాలం కీలక పాత్ర పోషించిన రైనాకే చోటు లేని వన్డే జట్టులో ఉన్నపళంగా యువీని తేవాలనుకోవడం వెనక ఆంతర్యమేమిటో..! కుంబ్లే ఆలోచన ఏమిటి..? ప్రధాన కోచ్‌గా ఇప్పుడు జట్టు ఎంపికలో అనిల్ కుంబ్లే పాత్రనే కీలకంగా మారిందని, అన్నింటా ఆయన ముద్ర ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. టెస్టు సిరీస్‌లో కోహ్లి ఐదుగురు బౌలర్ల థియరీలో కూడా కుంబ్లే వచ్చాకే మార్పు జరిగింది. అరుుతే యువ ఆటగాళ్లతో మరింతగా దూసుకుపోవాల్సిన తరుణంలో ఎప్పుడో నమ్మకం కోల్పోరుున ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలనే కుంబ్లే ఆలోచనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తనతో కలిసి ఆడిన, గతంలో గంభీర్, యువరాజ్ ఆటను దగ్గరినుంచి చూసిన కుంబ్లేకు వారిపై విశ్వాసం ఉండవచ్చు. సీనియర్లు కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా కావచ్చు. తన మాటను నెగ్గించుకోవాలని పరోక్ష ఉద్దేశం కూడా ఇందులో కనిపిస్తోంది. కానీ మా కుర్రాళ్లు అంటూ కోహ్లి బలంగా నమ్మకముంచి అందరినీ ప్రోత్సహిస్తున్న సమయంలో వెటరన్లు రావడం కూర్పును దెబ్బ తీసే అవకాశం ఉంది. కెరీర్ చివర్లో ఉన్న ధోని గతంలోలాగా అన్ని విషయాలు పట్టించుకోవడం లేదు. కానీ కోహ్లి వైపునుంచి చూస్తే మాత్రం గంభీర్ పునరాగమనం అతడిని ఇబ్బంది పెట్టవచ్చు. గంభీర్, కోహ్లి మధ్య ‘యుద్ధం’ ఇటీవలి ఐపీఎల్ సమయంలోనూ కొనసాగింది. రాహుల్ లేకపోతే తుది జట్టులో కచ్చితంగా ధావన్‌కే అవకాశం ఇవ్వడానికే కోహ్లి ఇష్టపడతాడు. మరో వైపు గంభీర్, యువరాజ్ సింగ్‌లను మళ్లీ ఆడించి అధికారికంగా వీడ్కోలు చెప్పిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. జయంత్ యాదవ్‌కు చోటు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మిగతా మ్యాచ్‌ల కోసం ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను కూడా ఎంపిక చేశారు. ఇషాంత్ శర్మ స్థానంలో జయంత్ జట్టులోకి వచ్చాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల జయంత్ 42 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 117 వికెట్లు పడగొట్టాడు. -
తరం మారింది..!
♦ కొత్త కొత్తగా భారత టెస్టు జట్టు ♦ దాదాపు అందరికీ ఐదేళ్లకంటే తక్కువ అనుభవం దాదాపు రెండేళ్ల క్రితం సచిన్ రిటైర్ అయ్యేంత వరకు భారత టెస్టు జట్టంటే అందరి మనసుల్లో ఒక లైనప్ ముద్రించుకుపోయింది. సెహ్వాగ్, గంభీర్ ఓపెనర్లుగా ఆ తర్వాత ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్...ఇలా చాలా వరకు ఈ జట్టు మార్పులు లేకుండా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఒక దశలో దేశవాళీలో అద్భుతాలు చేసినా, ఈ స్టార్ల కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన బ్యాట్స్‌మన్ ఎందరో ఉన్నారు. దిగ్గజాలు రిటైర్ అయినా ధోని టెస్టులు ఆడినంత వరకు జట్టులో సీనియర్లు లేని లోటు కనిపించలేదు. అప్పుడప్పుడు సెహ్వాగ్, గంభీర్, జహీర్, హర్భజన్ ఇలా ఎవరో ఒకరు టెస్టు తుది జట్టులో ఆడుతూ రావడంతో మరీ జూనియర్ల జట్టుగా కూడా అనిపించలేదు. కానీ ఇప్పుడు తరం మారింది. శ్రీలంకతో ఆడుతున్న టెస్టు జట్టును చూస్తే ఇద్దరు మినహా ఎవరికీ కనీసం ఐదేళ్ల అనుభవం కూడా లేదు. చివరకు జట్టును నడిపిస్తున్న కోహ్లికి కూడా. అయినా సరే ఈ జట్టు ఆత్మవిశ్వాసంతో నిలబడింది. రెండో టెస్టు విజయం తర్వాత మరింత నమ్మకం పెంచింది. ఒకరు గాయంతో దూర మైనా... నేనున్నానంటూ ఆ బాధ్యతను తీసుకునేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండటం మంచి పరిణామం. సాక్షి క్రీడా విభాగం : గత ఐదేళ్ల కాలంలో భారత జట్టు తరఫున 20 మంది ఆటగాళ్లు టెస్టుల్లోకి అడుగు పెట్టారు. వీరిలో పది మంది ఇప్పుడు శ్రీలంకలో పర్యటిస్తున్న టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ టూర్లో లేకపోయినా...షమీ, కరణ్, జడేజాలాంటి ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి రాగల సత్తా ఉన్నవారే. ప్రస్తుత సిరీస్‌లో చూస్తే హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలకు మాత్రమే ఐదేళ్ల అనుభవం ఉంది. మురళీ విజయ్ 2008లోనే తొలి టెస్టు ఆడినా 2010 తర్వాత అతను రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భజ్జీ కెరీర్ చరమాంకంలో ఉండగా, ఇషాంత్ బౌలింగ్‌లో పదును లోపించింది. కాబట్టి భారత జట్టు భారమంతా కొత్త ఆటగాళ్లపైనే నిలిచిందనడంలో సందేహం లేదు. కోహ్లి అండగా... ‘రాబోయే కొన్నేళ్ల పాటు ఈ జట్టులో చాలా మంది భారత్‌కు దశ, దిశ నేర్పించగలరు. అందుకే కఠిన పరిస్థితుల్లోనూ రాణించడం నేర్చుకోవాలి’ అంటూ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటననుంచి తరచుగా చెబుతూ వస్తున్నాడు. సహచరులలో పదే పదే ఇదే మాటతో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు. టెస్టు క్రికెటర్‌గా నాలుగేళ్ల అనుభవం మాత్రమే ఉన్న కోహ్లి, ఇప్పుడు తాను ఆడుతూ జట్టును నడిపించాల్సిన బాధ్యతను మోస్తున్నాడు. కోహ్లి ఇప్పటి వరకు 36 టెస్టులే ఆడాడు. బ్యాటింగ్ బృందంలో కోహ్లికంటే కాస్త ఎక్కువ అనుభవం ఉన్న పుజారా కూడా జట్టులోకి వచ్చి ఐదేళ్లు కాలేదు. ఈ సిరీస్‌కు ముందు ఓపెనర్లుగా ధావన్, విజయ్లే కనిపించారు. కానీ మూడో టెస్టు వచ్చేసరికి కాంబినేషన్ పూర్తిగా మారిపోతోంది. గాయాలతో ఎవరూ దూరమైనా ఆ స్థాయిలో ఆడేందుకు తర్వాతి బృందం సిద్ధంగా ఉంది. కొత్తవాడే అయినా లోకేశ్ రాహుల్ బ్యాటింగ్‌లో ఎంతో పరిణతి చూపించాడు. మూడేళ్ల క్రితం అయితే అతను ఇంత తొందరగా జట్టులోకి వచ్చి తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కకపోయేదేమో! ధావన్ అయితే రెండేళ్లకే స్టార్‌గా మారిపోయాడు. వీరూ, గౌతీలాంటి వాళ్లను మరచిపోయే ప్రదర్శన చేశాడు. భారత బృందంలో స్టార్ల కారణంగా రంజీలు ఆడిన ఆరేళ్ల తర్వాత గానీ చోటు దక్కించుకోలేకపోయిన రహానే ఇప్పుడు ఎలా చెలరేగుతున్నాడో చూస్తున్నాం. ఇక కేవలం రెండేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కే కరుణ్ నాయర్‌కు టీమిండియా పిలుపు రావడం కొత్త మార్పుకు సూచన. బౌలింగ్ నాయకుడిగా అశ్విన్ ఆటగాడిగా అశ్విన్ కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లు కూడా కాలేదు. కానీ అతనే ఇప్పుడు ‘బౌలింగ్ లీడర్’. పక్కలో బల్లెంలా మరో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ జట్టులో ఉన్నా... అనుభవంకంటే పదునైన ఆటకే విలువ అనేది రెండో టెస్టులో అతను మరోసారి నిరూపించాడు. పేరుకు 64 టెస్టుల అనుభవంతో ఇషాంత్ సీనియర్‌గా ఉన్నా... ఇప్పుడు భారత పేస్ బండిని ఉమేశ్ యాదవ్ నడిపిస్తున్నాడనేది వాస్తవం. ఒకానొక సమయంలో ధోని ఉండగా చోటు రాదని భావించి భారత దేశవాళీ క్రికెట్లో కీపింగ్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లు కూడా ఉన్నారు! కానీ అతని ప్రత్యామ్నాయంగా స్థానం దక్కించుకున్న సాహా రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌లో రాణించాడు. నమ్మకం నిలబెట్టాలి అనుభవం తక్కువగా ఉన్నా... స్టార్ల చాటున సహాయక పాత్రలో కాకుండా జట్టులో దాదాపు అందరికీ తమను తాము నిరూపించుకునే అవకాశం లభిస్తోంది. కొత్త తరానికి సంబంధించి ఇదే చెప్పుకోదగ్గ విషయం. ప్రతీ ఒక్కరు ఇప్పుడు తానే సీనియర్‌గా భావించి బాధ్యతను అందుకుంటున్నారు. ఈ అవకాశాన్ని వారంతా చక్కగా వాడుకున్నారు కూడా. అయితే మనతో పోలిస్తే శ్రీలంక జట్టు ఇంకా కుర్రాళ్లతో నిండి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అంతా అద్భుతం అని చెప్పలేం. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ వీరి సామర్థ్యానికి పరీక్ష. -
విరాట్ కోహ్లి ర్యాంక్ 15
దుబాయ్: మెల్బోర్న్ టెస్టులో అద్భుతంగా రాణించిన భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను 15వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. రహానే 15 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు. చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు వరుసగా 19, 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తొలిసారి 5వ స్థానంలో నిలిచి కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేశాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు చెరో 8 స్థానాలు మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వరుసగా 36, 38వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో అశ్విన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.