ఒక్క బెర్త్... మూడు జట్లు! | Almost three teams will qualified | Sakshi
Sakshi News home page

ఒక్క బెర్త్... మూడు జట్లు!

Published Sat, May 17 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

ఒక్క బెర్త్... మూడు జట్లు!

ఒక్క బెర్త్... మూడు జట్లు!

ఆసక్తికరంగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు
 మూడు జట్లకు బెర్త్‌లు దాదాపు ఖాయం
 రెండు జట్లకు ఆశలు లేవు
 
 ఐపీఎల్-7 కీలక దశకు చేరింది. ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 15 మ్యాచ్‌లు. మూడు జట్లు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ఖాయం చేసుకోగా... రెండు జట్లు అవకాశం లేని స్థితిలో నిలిచాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం మూడు జట్లు రేస్‌లో నిలిచాయి.
 
  కనీసం 16 పాయింట్లకు చేరుకునే జట్లు ప్లే ఆఫ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. ఇక లీగ్ దశలో టాప్-2లో నిలవడం కూడా కీలకం. ప్లే ఆఫ్ దశలో ఒక మ్యాచ్‌లో ఓడిపోయినా ఫైనల్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెన్నై, పంజాబ్, రాజస్థాన్ లాంటి జట్ల లక్ష్యం ఇది. ప్రస్తుత సమీకరణాలను బట్టి లీగ్‌లో ముందంజ వేసేందుకు ఆయా జట్లకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం.     
 - సాక్షి క్రీడావిభాగం
 
  కోల్‌కతా నైట్ రైడర్స్
 ప్రస్తుత స్థితి: ఐదు మ్యాచ్‌లు గెలిచి ఐదు ఓడటంతో జట్టు ఖాతాలో 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. జట్టుకు మిగిలిన నాలుగు మ్యాచుల్లో కనీసం మూడు విజయాలు అవసరం.


 ఆడాల్సిన మ్యాచ్‌లు: హైదరాబాద్‌తో రెండు, చెన్నై, బెంగళూరులతో ఒక్కోటి ఆడాల్సి ఉంది.
 అవకాశాలు: వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గి ఫామ్‌లోకి రావడంతో ప్లే ఆఫ్‌పై ఆశలు నిలిచాయి. చెన్నై పటిష్టమైన ప్రత్యర్థి కాబట్టి ఇతర మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలి.  నాలుగులో మూడు మ్యాచ్‌లు సొంతగడ్డపైనే జరుగుతుండటం అనుకూలాంశం.
 
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్
 ప్రస్తుత స్థితి: టోర్నీలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 2 మాత్రమే ఓడింది.
 ఆడాల్సిన మ్యాచ్‌లు: ఢిల్లీతో రెండు, ముంబై, రాజస్థాన్‌లతో ఒక్కో మ్యాచ్
 అవకాశాలు: ప్లే ఆఫ్‌కు దాదాపుగా చేరినట్లే. మరో విజయం ఆ జట్టు ఖాతాలో చేరితే ఖరారు అవుతుంది. ఫామ్‌ను బట్టి చూస్తే కనీసం రెండు మ్యాచ్‌లు సునాయాసంగా గెలవవచ్చు. అయితే టాప్-2లో నిలవాలని జట్టు భావిస్తోంది. అలా అయితే తొలి ప్లే ఆఫ్‌లో ఓడినా మరో మ్యాచ్ అవకాశం దక్కుతుంది.
 
 రాజస్థాన్ రాయల్స్
 ప్రస్తుత స్థితి: 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం కాకపోయినా చేరువలోనే ఉంది. ఆడాల్సిన మ్యాచ్‌లు: ముంబైతో రెండు, పంజాబ్‌తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.
 
 అవకాశాలు: మ్యాచ్ ఆరంభానికి ముందు సాధారణంగా కనిపిస్తున్నా...మైదానంలో దిగాక రాజస్థాన్ జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో కొన్ని సంచలన విజయాలు నమోదు చేసిన ఈ టీమ్ ముంబైని కనీసం ఒక మ్యాచ్‌లో ఓడించినా 16 పాయింట్లకు చేరుకొని అవకాశాలు మెరుగు పర్చుకుంటుంది. పంజాబ్ బలంగా ఉంది కాబట్టి ముంబైపై రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్-2 ఆశలు ఉంటాయి.
 
  సన్‌రైజర్స్ హైదరాబాద్
 ప్రస్తుత స్థితి: ఇప్పటి వరకు నాలుగే విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉంది. సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిన ఈ జట్టు సత్తాను విశ్లేషిస్తే నిరాశాజనకంగా కనిపిస్తుంది.
 ఆడాల్సిన మ్యాచ్‌లు: కోల్‌కతాతో రెండు, బెంగళూరు, చెన్నైలతో ఒక్కో మ్యాచ్ ఆడాలి.
 
 అవకాశాలు: మిగిలిన నాలుగూ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరవచ్చు. కనీసం మూడు నెగ్గితే ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. కానీ ఫామ్ చూస్తే అది అంత సులువు కాదు. ఉప్పల్‌లో మిగిలిన రెండూ గెలిచినా చెన్నైపై విజయం అంత సులువు కాదు. కాబట్టి కోల్‌కతాను రెండుసార్లూ ఓడించాల్సిందే.
 
 ఢిల్లీ డేర్‌డెవిల్స్
 ప్రస్తుత స్థితి: గత ఏడాదిలాగే ఈ సారి కూడా అందరికంటే ముందే లీగ్‌నుంచి ఈ జట్టు నిష్ర్కమించింది. 11 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచిన ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి.
 ఆడాల్సిన మ్యాచ్‌లు: రెండు పంజాబ్‌తో, ఒక మ్యాచ్ ముంబైతో ఆడాల్సి ఉంది.
 అవకాశాలు: ఏ మాత్రం లేవు. ఇతరుల అవకాశాలు చెడగొట్టం కూడా ఆ జట్టుకు సాధ్యం కాదు. ఎందుకంటే దాదాపు ప్లే ఆఫ్‌కు చేరిన పంజాబ్‌తో, దాదాపుగా నిష్ర్కమించిన ముంబైతోనే మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక వేళ ముంబైని ఓడించగలిగినా పంజాబ్‌పై రెండు మ్యాచ్‌ల్లో గెలుపు అనేది ప్రస్తుత ఫామ్‌తో అత్యాశే అవుతుంది.
 
  చెన్నై సూపర్ కింగ్స్
 ప్రస్తుత స్థితి: పాయింట్లలో పంజాబ్‌తో సమానంగా (16) ఉన్నా... రన్‌రేట్ కాస్త తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. ఆడాల్సిన మ్యాచ్‌లు: బెంగళూరుతో రెండు, హైదరాబాద్, కోల్‌కతాలతో ఒక్కోటి ఆడాల్సి ఉంది.
 
 అవకాశాలు: ఈ స్థితిలో ధోని సేన కూడా ప్లే ఆఫ్‌కు చేరువైనట్లే. ప్రత్యర్థి బలాలను బట్టి చూస్తే మరో రెండు మ్యాచ్‌లు కూడా నెగ్గవచ్చు. ఈ జట్టు కూడా కచ్చితంగా టాప్-2లో ఉండాలనే లక్ష్యంతో ఉంది.
 
  బెంగళూరు రాయల్ చాలెంజర్స్
 ప్రస్తుత స్థితి: సరిగ్గా సన్‌రైజర్స్ స్థితిలోనే బెంగళూరు కూడా నిలిచింది. ఆ జట్టుకూ 8 పాయింట్లే ఉన్నాయి. తమతో పోటీలో ఉన్న కోల్‌కతా, హైదరాబాద్‌లను వెనక్కి నెట్టాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు నెగ్గడం ఒక్కటే మార్గం. ఆడాల్సిన మ్యాచ్‌లు: చెన్నైతో రెండు, హైదరాబాద్, కోల్‌కతాలతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
 
 అవకాశాలు: గత మ్యాచ్‌లో భారీ విజయంతో టీమ్ అదృష్టం మారినట్లు కనిపించినా...లీగ్‌లో కీలక సమయాల్లో ఈ జట్టు మ్యాచ్‌లు చేజార్చుకుంటోంది. చెన్నైని కనీసం ఒక సారి ఓడించడంతో పాటు, ఇతర మ్యాచ్‌లు గెలిస్తే ప్రత్యర్థుల గణాంకాలపై ఆధార పడవచ్చు. కానీ వాస్తవికంగా ఇది అంత సులభం కాదు.
 
  ముంబై ఇండియన్స్
 ప్రస్తుత స్థితి: ఆడిన 10లో ఏడు మ్యాచ్‌లు ఓడి 6 పాయింట్లతోనే ఉన్న ఈ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు నెగ్గినా 14 పాయింట్లకే పరిమితమవుతుంది.

 ఆడాల్సిన మ్యాచ్‌లు: రాజస్థాన్‌తో రెండు, ఢిల్లీ, పంజాబ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది.
 అవకాశాలు: సీజన్‌లో ఘోర వైఫల్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న ఫామ్‌తో పంజాబ్, రాజస్థాన్‌లను ఓడించటం దాదాపుగా కష్టమే. కాబట్టి ముంబైకి దారులు మూసుకుపోయినట్లే. దీనికి తోడు మలింగ కూడా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లండ్‌తో టి20ల కోసం మలింగ లంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు వెళ్లాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement