
స్విమ్మింగ్‌పూల్‌ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్: క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పాడిపరిశ్రమ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేట గురుగోవింద్ సింగ్ ఆడిటోరియంలోని స్విమింగ్‌పూల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్విమ్మింగ్‌పూల్‌లో నీరు లేక సకాలంలో ప్రారంభానికి నోచుకోలేదని తెలిపారు. ఈసారి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నిరంతరం నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ద్వారా జలమండలికి 22 లక్షల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు.
నగరంలో ఎక్కడా లేని విధంగా అమీర్‌పేట స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్‌తో పాటు స్కేటింగ్, బ్యాడ్మింటన్, కరాటే, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, యోగా, జిమ్ సౌకర్యాలను కల్పించామని తెలిపారు. 50 మందికి ఒకేసారి స్విమ్మింగ్‌లో శిక్షణ ఇచ్చేలా సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమీర్‌పేట కార్పొరేటర్ నామన శేషు కుమారి, పలువురు జీహెచ్‌ఎంసీ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment